గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (21:36 IST)

పోరాటం పేరుతో చంద్రబాబు డ్రామాలు: శ్రీకాంత్ రెడ్డి

అమరావతిలో తన బినామీల భూములకు నష్టం జరుగుతుందనే ఆందోళనతోనే చంద్రబాబు పోరాటం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

గుంటూరుజిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారంను కాపాడుకునేందుకు ప్రాకులాడుతున్నాడని విమర్శించారు.

అభివృద్థి వికేంద్రీకరణను అడ్డుకుంటున్న చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, దానిని రెఫరెండంగా తీసుకోవాలని సవాల్ చేశారు. ఎక్కడ తన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను సిబిఐ విచారణకు అప్పగిస్తారనే భయంతోనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడు రైతుల పక్షాన నిలబడలేదని అన్నారు. కానీ ఈ రోజు రైతుల కోసం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని అన్నారు. ఈనాడు రైతుల సమస్యల గురించి కాకుండా తన బినామీల ప్రయోజనాల గురించి ఆందోళన చెందుతున్నాడని అన్నారు.

దీనిని రైతు సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ జీవితం వరకు ప్రతి ఒక్కటి అసత్యాలతో నిండిపోయిందని, ఈ రోజు అమరావతి కోసం ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పడం విడ్డూరంగా వుందని ఎద్దేవా చేశారు. 

నాయకుడు అనే వారికి అన్ని ప్రాంతాలు అభివృద్థి చెందాలనే చిత్తశుద్ది వుండాలని, అందరికీ మంచి జరగాలనే ఆలోచనతో వుండాలని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పట్టణాలు, నగరాల్లో వ్యాపారులు రంగురంగుల గ్రాఫిక్స్ తో బ్రోచర్లు వేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని, అలాగే చంద్రబాబు కూడా అమరావతి పేరుతో రంగుల గ్రాఫిక్స్ చూపి ఈ ప్రాంత రైతాంగాన్ని మోసం చేశాడని ఆరోపించారు.

రైతులను తన మోసపూరితమైన ప్రచారంతో మాయ చేశాడని, తన కుట్రలతో రైతుల గొంతు కోశాడని ఆరోపించారు.  
రైతును ప్రేమించే నాయకుడు వైఎస్ఆర్ అయితే ఆయన వారసుడు వైఎస్ జగన్ కి రైతులంటే ఎంతో ప్రేమ వుందని అన్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబు రైతులకు భ్రమలు సృష్టించి, అయిదేళ్ల పాటు అధికారంలో వుండి కూడా వారికి ఏ రకమైన మేలు చేయలేకపోయాడని అన్నారు.

రైతు వ్యతిరేకి చంద్రబాబును కరకట్ట వద్ద ఆయన నివాసం వద్దకు వెళ్ళి రైతులు తమకు జరిగిన మోసంపై నిలదీయాలని అన్నారు. మోసపోయిన రైతాంగానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిలో గజం ముప్పై ఆరు వేలు అవుతుందని, ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుందనే భ్రమలు కల్పించారని విమర్శించారు. అయిదేళ్లు సీఎంగా వుండి కూడా రాజధానిలో ఏం చేయాలేక పోయారని అన్నారు.

చంద్రబాబు  రైతులను నిలువునా మోసం చేశారని, వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో 4,070 ఎకరాలు తన బినామీలు దక్కించుకున్న భూముల విషయం బయటకు వస్తోందని, ఇది ఎక్కడ సిబిఐకి అప్పగిస్తారనే భయంతో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ఈ భయంతోనే ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రైతులను ఇంతలా మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, వారి దృష్టి మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు జీవితంలో ఏనాడు ప్రజల కోసం చేసిన పోరాటం లేదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, మీడియాను అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు అలవాటు అని విమర్శించారు. 

చంద్రబాబు తాను కట్టించిన భ్రమరావతిలో శక్తిపీఠం వుందని చెప్పుకుంటున్నాడని, లేని సెంటిమెంట్ ను సృష్టించాలని కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. హైపర్ కమిటీ, బోస్టన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, శివరామకరృష్ణ కమిటీలు అభివృద్థి వికేందవ్రీకరణ జరగాలని చెబుతుంటే... దానిని అంగీకరించేందుకు చంద్రబాబు సిద్దంగా లేడని అన్నారు.

సీఎంగా అయిదేళ్ల పాటు రైతులకు ఏదో జరగబోతోందనే భ్రమలను కల్పించాడే తప్ప.. వారికి మంచి చేసే పనులు చేయలేదని అన్నారు. తనకు, తన బినామీల భూములకు నష్టం జరగకుండా లేని ఉద్యమాన్ని సృష్టించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడని, చివరికి తన సతీమణి భువనేశ్వరిని తీసుకువచ్చి ఒక గాజు దానం చేయించడం, గ్రామాల్లో మహిళలతో అరిసెలు పంచడం ద్వారా తన పాపాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. 

రైతుల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని, వారిని నిలువునా దగా చేశాడని అన్నారు. రైతులకు మేలు చేసేలా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏనాడు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు  మంచి చేసేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే... దానిని కూడా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.

రాజధాని ప్రాంతంలో రైతుల్లో అయోమయాన్ని సృష్టించి, మంటలను రగిలించి, దానిలో రాజకీయంగా చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్థి చెందాలని చంద్రబాబుకు నిజంగా మంచి ఉద్దేశం వుంటే...ఆనాడే శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీల్లోని వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా... నారాయణ కమిటీని వేసి ఏకపక్ష నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని ప్రకటించారని ఆరోపించారు.

ఇప్పుడు తన బినామీలు నష్టపోతున్నారని రాష్ట్రంలో అశాంతిని, ప్రాంతీయ విద్వేశాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి పరిరక్షణ పేరుతో జోలె పట్టుకుని చందాలు వసూలు చేస్తున్నారని, గతంలో ఇటుకలు అమ్మిన కోట్లాధి రూపాయలు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, కులాల మద్య అసమాతనలు సృష్టించడం చేస్తున్నారని, ఈ ఆటలు సాగనివ్వమని అన్నారు. 

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణకు ఒప్పుకునేది లేదని అన్న మాటలను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. ఇష్టం వచ్చినట్లు తన బినామీలతో రాజధానిలో చేసిన అవినీతిని చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చిన చంద్రబాబు ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారని అన్నారు.

చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే... తన ఇరవై మూడు మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించి, రెఫరండం లా ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. తనను తాను కాపాడుకునేందుకు ప్రజలను బయటకు రావాలని చంద్రబాబు కోరుతున్నాడని, చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు.

చంద్రబాబు గాంధీ, అంబేద్కర్ కాదని అన్నారు.  ఆయన తప్పులకు ప్రజలు ఎందుకు కాపాడాలని ప్రశ్నించారు. కొత్త నగరం నిర్మించాలంటే... 1.10 లక్షల ఓట్లు కావాలని ఇదే చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు చెప్పలేదా అని నిలదీశారు. ఇంత భారీ నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడం వల్లే తక్కువ ఖర్చుతో మూడు ప్రాంతాల్లో రాజధానులు వస్తుంటే... దానిని ఎందుకు అడ్డుకుంటున్నాడని విమర్శించారు.

రాయలసీమకు అరవై వేల కోట్లతో సాగునీరు ఇవ్వాలని సీఎం చేస్తున్న సంకల్పంను సీమవాసులు స్వాగతిస్తున్నారని,  
ఇటువంటి అభివృద్థిని చంద్రబాబు సహించలేక పోతున్నారని అన్నారు. చివరికి పక్క రాష్ట్రాలతో సఖ్యత వుండాలని కోరుకోవడం కూడా తప్పుగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అయిదేళ్లలో చేసిన అప్పులతో ఒక్క పర్మినెంట్ ఆస్తిని అయినా చూపించగలరా అని ప్రశ్నించారు.

ఆఖరికి రాజధానిలో నిర్మాణాలకు కూడా కేంద్రం నిధులు ఇచ్చిందని, ఇదేనా మీ పాలనా అనుభవం అని ప్రశ్నించారు. చంద్రబాబు తన సొంత అవసరాలు, అవినీతి కోసం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని విమర్శించారు. రాయలసీమలో హైకోర్ట్ పెడితే రెండు జీరాక్స్ సెంటర్లు వస్తాయని ఎద్దేవా చేస్తారా అని మండిపడ్డారు.

తనకు అనుకూలమైన పత్రికల్లో, ఎల్లో మీడియాలో వైజాగ్ లో ఎగ్జిక్యూటీవ్ రాజధాని పెడితే దూరం అవుతుందని రాయిస్తున్నాడని, ఇతర రాష్ట్రాల్లో రాజధానులు ఎంత దూరంలో వున్నాయో చంద్రబబుకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించేలా... రియల్ ఎస్టేట్ లో తన బినామీలకు నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతున్నాడని విమర్శించారు.

అన్ని ప్రాంతాల పైన సమాన ప్రేమ వుంటేనే మంచి నాయకుడు అవుతాడని, చంద్రబాబుకు అటువంటి ఉద్దేశాలు లేవని అన్నారు. రాయలసీమకు వచ్చినప్పుడు ఒకలా, కోస్తాలో మరొకలా మాట్లాడటం చంద్రబాబుకే సొంతమని అన్నారు. మేం మాత్రం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమతుల అభివృద్థి చెందాలనే ఒకే స్టొండ్ తో వున్నామని అన్నారు. విశాఖ నగరంలో మేం నాలుగు సీట్లలో ఓడిపోయాం.. .అమరావతిలో మాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

అటువంటి ఈ ప్రాంతాన్ని మేం నిర్లక్ష్యం చేస్తామా.. విశాఖపై వివక్షత చూపుతామా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో స్వార్థాలు వుండకూడదనే తమ ఉద్దేశమని అన్నారు. కళ్ళముందే గోదావరి నది వున్నా కూడా ఉభయ గోదావరి జిల్లాలు  తాగునీరు లేక అల్లాడుతున్నాయని ఈ జిల్లాలకు ఏడువేల కోట్లతో వాటర్ గ్రిడ్ తీసుకువస్తున్నామని అలాగే ఉద్దానం, పల్నాడు, కనిగిరి ప్రాంతాల్లో వేల కోట్లతో మంచినీటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.

అనేక సంక్షేమ పథకాలతో ఈ ఏడు నెలల్లో ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందించామని అన్నారు. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పారదర్శకంగా జరుగుతున్న వైఎస్ జగన్ గారి పాలనను చూపి తట్టుకోలేక చంద్రబాబు తప్పుడు పోరాటాలకు దిగుతున్నాడని అన్నారు.

ఇసుక, ఇంగ్లీష్ అంటూ నెలకు ఓ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి మళ్లీమళ్లీ రావాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు అమరావతి రైతు పోరాటం అంటూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు.