ఆలయాల్లో ప్రసాదాల కోసం పాకులాడుతున్న కూలీలు : చంద్రబాబు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం పాలకులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. పైగా, కొత్త పాలసీ విధానం పేరుతో ఇసుక అందుబాటులో లేకుండా చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా భవన నిర్మాణ కూలీలు ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ మృతులపై విపక్ష నేతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కూలీల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల ఉపాధిని ప్రభుత్వం కాలరాస్తే ఆకలి బాధ తట్టుకోలేని కొందరు కూలీలు ఆలయాల్లో అన్నప్రసాదాలపై ఆధారపడి బతుకుతున్నారని వివరించారు. మరో చోట మెతుకు కోసం చెత్తకుప్పల్లో వెతుకుతున్న ఓ కూలీని తలుచుకుంటే కళ్లు చెమర్చుతున్నాయంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ప్రజలకు ఇంత దయనీయ పరిస్థితులు తీసుకువచ్చినందుకు వైసీపీ ప్రభుత్వ పాలకులు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో మీరు సాధించిన ఘనకార్యం ఇదేనా? అంటూ నిలదీశారు. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో 'అన్న క్యాంటీన్' ఉన్నా కూలీల కడుపు నింపేదని తెలిపారు. ఇప్పుడైనా అన్న క్యాంటీన్లను తెరిచి పేదలను, కూలీలను ఆదుకోవాలని హితవు పలికారు.