చంద్రబాబు హౌస్‌ అరెస్టు.. టీడీపీ నిరాహారదీక్ష... రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్

nannapaneni at chandrabu house
ఎం| Last Updated: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:55 IST)
గుంటూరు జిల్లాలో రాజకీయ వేడికి, తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన టీడీపీ ‘చలో ఆత్మకూరు’ను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టు చేశారు.

ఇందుకు నిరసనగా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షకు పిలుపునిచ్చిచ్చారు. 12 గంటల నిరాహారదీక్ష మొదలు పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపి శ్రేణులు ఎక్కడికక్కడ దీక్షలు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వస్తున్న నన్నపనేని రాజకుమారి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించిన నన్నపనేని రాజకుమారిని ఉండవల్లి కరకట్ట రోడ్డు ప్రారంభంలోనే అడ్డుకున్నారు.

చలో ఆత్మకూరు నేపథ్యంలో మంగళవారం రాత్రి శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ముందస్తు అరెస్టు కోసం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘చలో ఆత్మకూరు’ నిర్వహించాలని.. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలని కృతనిశ్చయంతో ఉన్న టీడీపీ అధిష్ఠానం పోలీసు చర్యలను ముందే పసిగట్టింది.

పార్టీ ముఖ్య నేతలందరినీ రాత్రికి రాత్రే గుంటూరులోని వైసీపీ బాధితుల పునరావాస శిబిరానికి రావాలని ఆదేశించింది. పోలీసులను ప్రతిఘటించి బాధితులతో కలిసి ఆత్మకూరుకు వెళ్లితీరాలని టీడీపీ పట్టుదలతో ఉండగా.. నేతలందరినీ శిబిరం వద్దే హౌస్‌ అరెస్టు చేయడం సులభమవుతుందని పోలీసులు కూడా భావిస్తున్నారు.

బాధితులను బయటకు రానివ్వకుండా చూడాలని.. ఇదే సమయంలో లోనికి కూడా ఎవరినీ అనుమతించకూడదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో గుంటూరులోని అరండల్‌పేట 3వ లైన్‌లో పునరావాస శిబిరం కొనసాగుతున్న వైన్‌డీలర్స్‌ కల్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.

బాధితులతో పాటు వివిధ్రపాంతాల నుంచి తరలి వస్తున్న నాయకులు, కార్యకర్తలతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చలో ఆత్మకూరును గుంటూరులోనే పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఆక్టోపస్‌, స్పెషల్‌ వెపన్‌ అండ్‌ టాక్టీస్‌ టీమ్‌ (స్వాట్‌), యాంటి నక్సల్స్‌ స్క్వాడ్‌ (ఏఎన్‌ఎ్‌స), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టిఎఫ్‌), ఏపీఎస్పీ, ఏఆర్‌, సివిల్‌ విభాగాలకు చెందిన వెయ్యి మందికి పైగా పోలీసులు మోహరించారు.

పల్నాడులోనే గాక గుంటూరు నగరంలోనూ 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నాయని అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం ‘చలో ఆత్మకూరు’కు అనుమతి లేదని.. దీనిని విరమించుకోవాలని మంగళవారం రాత్రి కోరారు.

‘చలో ఆత్మకూరు’కు వైసీపీ కూడా దరఖాస్తు చేసిందని, వారి అభ్యర్ధనను తిరస్కరించామని.. టీడీపీ అనుమతే కోరలేదని తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎవరికీ అనుమతులు లేవని.. ఎవరైనా వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ బాధితుల కోసం శిబిరం ఏర్పాటుచేసిన గుంటూరు వైన్‌ డీలర్స్‌ కల్యాణ మండపంలో మంగళవారం రోజంతా క్షణం.. క్షణం ఉత్కంఠ నెలకొంది.
దీనిపై మరింత చదవండి :