ఎన్డీయే ప్రభుత్వంలో కేబినెట్‌లోకి టీడీపీ నుంచి నలుగురికి ఛాన్స్!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఆదివారం సాయంత్రం కొలువుదీరనుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సారథ్యంలో కొత్త కేంద్ర కేబినెట్ కూడా ఏర్పడనుంది. ఇందులో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలకు కలిపి ఆరు మంత్రి పదవులను కట్టబెట్టనున్నారు. ఇందులో టీడీపీకి నాలుగు, జేడీయుకు రెండు బెర్తులు దక్కనున్నాయి.
టీడీపీ నుంచి ఎంపికయ్యే నలుగురిలో రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాద్, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు చోటు ఉండవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి లలన్ సింగ్, రాంనాథ్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. లలన్ సింగ్ ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, రాంనాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. భారతరత్న గ్రహీత కర్పూరీ ఠాకూర్ తనయుడే రాంనాథ్ ఠాకూర్.
ఆదివారం రాత్రి 7.15 గంటలకు మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై, కేబినెట్ బెర్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 16 లోక్ సభ స్థానాలు గెలుపొందగా నాలుగు మంత్రిత్వ శాఖలు, స్పీకర్ పదవిని కోరింది. 12 సీట్లు గెలిచిన జేడియూ 2 శాఖలు అడిగింది. బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలిచి మేజిక్ ఫిగర్‌కు 32 సీట్ల (272) సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కేంద్రంలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కింగ్ మేకర్లు అయ్యారు.