మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (16:03 IST)

రుయా ఘటన హృదయాలను మెలితిప్పే విషాదం : చంద్రబాబు

chandrababu
తిరుపతిలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు మృతుడి తండ్రి అబులెన్స్‌ డ్రైవర్లను సంప్రదించాడు. ఈ ఆంబులెన్స్ మాఫియా 90 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేల బాడుగ అడిగారు. పైగా, ఉచిత అంబులెన్స్ డ్రైవర్ వచ్చినప్పటికీ అతన్ని బెదిరించి కొట్టి పంపించేశారు. 
 
దీంతో అంబులెన్స్‌‍కు రూ.10 వేలు ఇచ్చుకోలేక కన్నబిడ్డ శవాన్ని 90 కిలోమీటర్ల దూరం బైకులో తీసుకెళ్లాడు. ఈ హృదయ విదాకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. 
 
తిరుపతి రుయా ఆస్పత్రిలో బాలుడి మృతిపట్ల తన హృదయం క్షోభిస్తుందన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆ బాలుడి తండ్రి అధికారులను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. 
 
ఆస్పత్రి అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ ఉపయోగం లేని పరిస్థితుల్లో ప్రైవేటు అంబులెన్స్‌‍ డ్రైవర్లు ముందుకొచ్చినా ఆ పేద తండ్రి అంత ఖర్చు భరించలేకపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నబిడ్డ శవాన్ని బైకుపై వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించారని వివరించారు. 
 
హృదయాలను మెలితిప్పే ఈ విషాదం రాష్ట్ర ఆరోగ్య రంగ దుస్థితికి నిదర్శనమన్నారు. జగన్ పాలనలో ప్రతిదీ లోపభూయిష్టమేనని విమర్శించారు. శవాలను తరలించే అంబులెన్స్‌ల నుంచి ప్రాజెక్టుల వరకు అవినీతి పేరుకునిపోయిందని ఆయన ఆరోపించారు.