1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (16:22 IST)

పార్టీని లేకుండా చేయాలనే దాడులు... చంద్రబాబు

రాష్ట్రంలో తమ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే పథకం ప్రకారం దాడులు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​పై దాడిచేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని మండిపడ్డారు. 
 
మంగళవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిరసన చేపట్టారు. ఈ దీక్ష గురువారం నుంచి శుక్రవారం వరకు 36 గంటల పాటు దీక్షను చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదని.. కానీ ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామన్నారు. 
 
వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకోలేకపోతే పోలీస్‌ వ్యవస్థను మూసేయాలని డీజీపీకి హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. 
 
ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింభమని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తమ పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమన్న బాబు.. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు ఆయన ప్రకటించారు.