శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (13:30 IST)

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్

తాను నిరసన దీక్ష ఎన్టీఆర్ భవన్ లో చేయడం ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న కార్యాలయంపై దాడి చేశార‌ని, ఇది. తెలుగు ప్రజలకు పవిత్రమైన దేవాలయం. అలాంటి దేవాలయం మీద, కార్యకర్తల మనోభావాల మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరమ‌న్నారు. దేశ చరిత్రలో, నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులు చూడలేద‌న్నారు. 
 
ఈ దాడులపైన పెద్ద కుట్రే జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే వుంది. వైసీపీ వాళ్లు వచ్చినప్పుడు మేం  వర్చువల్ మీటింగ్ లో ఉన్నాం. అప్పుడే 4.30 గంటలకు పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని సమాచారం వచ్చింది. పట్టాభి భార్యను, 8 ఏళ్ల చిన్న అమ్మాయిని కాపాడాలని ఆలోచిస్తున్నాం, ఆలోపే ఇళ్లు మొత్తం ధ్వంసం చేశారు. మామాలుగా ఆవేశం వుంటే..రాయి వేసి, ఒక దెబ్బ కొడతాం. కానీ చిన్నపిల్ల వుంటే వారి మనోభావాలు ఆలోచించకుండా దాడి చేశారంటే వారి మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి. పెద్దయ్యాక అదే మనోభావాలు గుర్తుంటాయి. వెంటనే డీసీపీ, డీజీపీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ అప్పుడే.. డీజీపీ కార్యాలయం పక్కన, సీకే కన్వెన్షన్  నుండి 150 మంది  పార్టీ కార్యాలయానికి బయలు దేరారని సమాచారం అందింది. వెంటనే 5.03 నిమిషాలకు డీజీపీకి ఫోన్ చేశాను. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. నేను ఫోన్ చేస్తే పనులున్నాయని డీజీపీ ఫోన్ తీయలేదు. పక్కన వుండే అర్బన్ ఎస్పీకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. సీఐకి, డీఎస్పీకి మా కార్యాలయ సిబ్బంది ఫోన్ చేస్తే ఏం జరగుతుంది, మీకెలా తెలుసు అని మాట్లాడే పరిస్థితి వుంది. నేను వెంటనే గవర్నర్ కు ఫోన్ చేశాను....అని చంద్ర‌బాబు వివ‌రించారు.
 
 
విశాఖ పార్టీ ఆఫీసుపై దాడి చేశారు, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంపై దాడి చేశారు. కడపలో అమీర్ బాబు ఇంటిపై, లింగారెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఇంచార్జి సుధీర్ రెడ్డి రేణిగుంట్లలో వుంటే ఆయన కారు పగలగొట్టారు..ఇవన్నీ గవర్నర్ కు చెప్పాను. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.. టీడీపీ నేతలను, కార్యాకర్తలను చంపాలని చూస్తున్నారు, గవర్నర్ గా మీకు అధికారం వుంది, వాటిని అరికట్టండని చెప్పాం. కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశాను. వంద మీటర్ల దూరంలో మా పార్టీ కార్యాలయానికి డీజీపీ ఆఫీస్ వుంది. బెటాలియన్ వుంది. పక్కన సీఎం ఇళ్లు వుంది. కానీ టీడీపీ కార్యాయలంపై దాడి జరిగింది. పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి ఈ దాడి చేశారు. కేంద్రమంత్రిగా మీరు జోక్యం చేసుకోండి, దేశంలో ఈ రాష్ట్రం భాగం, బాద్యత తీసుకోండని చెప్పాను. తక్షణమే చర్యలు తీసుకుంటాం..లేఖ పంపండని చెప్పార‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 
 
వైసీపీ గూండాలు నేరుగా ఈ డీజీపీ ఆఫీసు ముందు నుండే వచ్చారు. మన గేటును కారుతో కొట్టి పడగొట్టారు. వున్న వాళ్లను సుత్తెలతో విచక్షణా రహితంగా కొట్టారు. తాగి వచ్చి వీరంగం సృష్టించి, కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. తర్వాత తీక్షణంగా పోలీసులు వచ్చి వాళ్లను సాగనంపారు. మీకు సిగ్గనిపించలేదా డీజీపీ, పోలీసులు.? మమ్మల్ని మేము కాపాడుకోవాలి. వైసీపీకి సవాల్ విసురుతున్నా..మమ్మల్ని మేము కాపాడుకోగలం.. పోలీసులకు చేతగాకపోతే స్టేషన్లు మూసేసుకుని వెళ్లండి. నేను ముఖ్యమంత్రిగా చేశా, 22 ఏళ్లు టీడీపీ అధికారంలో వుండి, సామాన్య ప్రజలు, ప్రతిపక్షం ఎవరికి ఆపద వచ్చినా కాపాడిన ఏకైక పార్టీ టీడీపీ. జగన్ రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేశారు, డీజీపీ రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేసి పదవి స్వీకరించారు. ఇంత విధ్వంసం జరిగితే మీరు ఏం చేశారు? అని ప్ర‌శ్నించారు.
 
ఇప్పటి వరకు నా మంచి తనాన్ని చూశారు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్. జగన్ ను హెచ్చరిస్తున్నా. రాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అలాంటప్పుడు 356 పెడతారు. టీడీపీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కావాలని అడగలేదు. ఒక పార్టీ కార్యాలయంపైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థపైన పద్దతి ప్రకారం చేశారు. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయి, 356 పెట్టి రాష్ట్రాన్ని కాపాడాలని కోరాను. ఎన్ని గట్స్ వుండాలి డీజీపీకి.? కార్యాలయానికి ఎవరో సీఐ వచ్చి అనుమానస్పదంగా తిరిగితే పట్టుకుని మీడియా ముందు మనవాళ్లు పెట్టారు. పోలీసులకు అప్పజెప్పిన తర్వాత అతనెల్లి మన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టారు. మా అనుమతి లేకుండా మీ అధికారి మా ఆఫీసుకు ఎందుకు వచ్చారు. మహావ్యవస్థకు ఈ డీజీపీ నాంది పలికారు..శబాష్. ఎన్ని చేస్తారో చేయండి చూస్తాం. పట్టాభి వాడిని బాష తప్పైతే సీఎం భాష ఏంటి.? మీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి.? ప్రజల్ని అడుగుదామా.? అని చంద్ర‌బాబు ఆవేశంగా అన్నారు.