బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (11:16 IST)

పట్టాభినే కాదు.. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి

టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుండా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల‌ని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా ఈ కుట్ర కోణంలో విచారణ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాన‌ని అంబ‌టి చెప్పారు. ఈ కుట్ర అంతటికీ తానే కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తాయన్నారు. 
 
మొద‌టి నుంచి చంద్ర‌బాబు వైఖ‌రి అనుమానాస్ప‌దంగా ఉంద‌ని, ఆయ‌న డైరెక్ష‌న్ తోనే టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాబి సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల‌యంలో ఉండి, ప‌ట్టాభి చేసిన దూష‌ణ‌లు అధినేత‌కు సంబంధం లేకుండా ఎలా ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అందుకే చంద్రబాబును కూడా అరెస్టూ చేసి విచారిస్తే, కుట్ర కోణం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని తాను నమ్ముతున్నాన‌ని, తక్షణం చంద్రబాబను అరెస్టు చేయాలని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.