1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (19:25 IST)

వైకాపా పాలకులను కీర్తిస్తూనే ఉండాలా? శైలజానాథ్ ప్రశ్న

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం సరిగా పనిచేస్తే రాష్ట్రం ఇలా తయారయ్యేది కాదన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, మంత్రులను సీఎం జగన్‌ ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రంలో ఏం జరిగినా ఒక మంత్రి మాత్రమే స్పందిస్తారన్నారు. సీఎంని ఎవరేమన్నా టీడీపీకి పట్టిన గతే పడుతుందని ఓ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, అంటే మీ తప్పులను ఎత్తి చూపకూడదా? కీర్తిస్తూ ఉండాలా? అని శైలజానాథ్‌ ప్రశ్నించారు. 
 
రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజమనే వాస్తవం జగన్ గుర్తించాలన్నారు. నిన్నటి దాడి ఘటనలో దోషులను చట్టపరంగా శిక్షించాలని శైలజానాథ్‌ డిమాండ్ చేశారు.
 
ఇకపోతే, గంగవరం పోర్ట్ ఆకస్మికంగా అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం వెనుక ఎవరి హస్తముందని ఆయన నిలదీశారు. బీవోవోటీ ఒప్పందాన్ని బయటకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2007‌లో ఏర్పాటు చేసిన  పోర్ట్ 30 ఏళ్ళ తరవాత ప్రభుత్వపరం కావాల్సిఉందన్నారు. 
 
14 ఏళ్లకే ప్రైవేట్‌పరం కావడం వెనుక మతలబు ఏంటని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ వెంచర్‌కు ఆనాడు కేంద్రం అనుమతి ఇవ్వనందని తెలిపారు. డీవీఎస్ రాజు 58-1 శాతం, దుబాయ్ కంపెనీ 31.5 శాతం, ప్రభుత్వం 10.39 శాతంతో గంగవరం పోర్టు ఏర్పాటైందని గుర్తుచేశారు. 
 
అసలు జాయింట్ వెంచర్‌తో ఏర్పాటైన ఈ పోర్ట్‌ను అమ్మే హక్కు ఎవరికి ఉండదన్నారు. ప్రైవేట్‌కు అప్పగించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహంలేదని శైలజానాధ్ పేర్కొన్నారు. దీనికంతటితీ ఏపీలో అసమర్థ పాలన, అసమర్థ ముఖ్యమంత్రి అధికారంలో ఉండటమేనని శైలజానాథ్ మండిపడ్డారు.