శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (20:57 IST)

ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం... అర్చకులకు 'చంద్రన్న బీమా'

అమరావతి : రాష్ట్రంలోని దేవాలయాలకు వస్తున్న భక్తులు, యాత్రికులను దృష్టిలో పెట్టుకుని తగు వసతి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ప్రోత్సహించేలా ప్రణాళికలను ర

అమరావతి : రాష్ట్రంలోని దేవాలయాలకు వస్తున్న భక్తులు, యాత్రికులను దృష్టిలో పెట్టుకుని తగు వసతి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ప్రోత్సహించేలా ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. శుక్రవారం దేవాదాయ, ధర్మదాయ శాఖపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ (ఏడబ్ల్యూఎఫ్ టి) ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 
 
దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు కూడా ‘చంద్రన్న బీమా’ పథకాన్ని వర్తింప చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ‘చంద్రన్న బీమా’ను వర్తింప చేయడం వల్ల వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. మృతి చెందిన అర్చకులు, ఇతర ఉద్యోగులకు ఏడబ్ల్యూఎఫ్‌టి కింద రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రమాదంలో చనిపోతే రూ. 1 లక్షను అదనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. 
 
అయితే, అసంఘటిత రంగ కార్మికుల కోసం అమలు చేస్తున్న ‘చంద్రన్న బీమా’ని వీరికి వర్తింప చేయడం వల్ల రూ. 5 లక్షల వరకు పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని, దీనిపై కార్మికశాఖ అధికారులతో మాట్లాడాలని చెప్పారు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఇస్తున్న రూ. 2 లక్షల మెడికల్ ఎయిడ్, ఇళ్ల నిర్మాణం, మరమ్మత్తులకు సంబంధించి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చేస్తున్న గ్రాంటుతో కూడిన రుణం పైనా సీఎస్ పలు సూచనలు చేశారు. 
 
పెరిగిన ధరల నేపధ్యంలో ఇళ్ల నిర్మాణానికి రుణం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచే విధంగా సూచనలు చేశారు. సీజీఎఫ్ కింద వివిధ దేవాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపైన సీఎస్ సమీక్షించారు. శ్రీశైలంలోని శ్రీ మల్లిఖార్జున స్వామి, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ, అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి, సింహాచలంలోని శ్రీ వరహ లక్ష్మి నరసింహా స్వామి ఇలా గుర్తించిన 25 ప్రధాన దేవాలయాల్లో భక్తులు, యాత్రికుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన పనులపైన చర్చించారు. 
 
అయితే, ఇందులో కదిరి, పెంచలకోన, బోయకొండకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమైన  దేవాలయాల్లో రూ.550 కోట్లతో వివిధ పనులను చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ, కనకదుర్గమ్మ దేవాలయం ఈవో సూర్య కుమారి, శ్రీశైలం దేవాలయం ఈవో భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.