చంద్రయాన్ -2 ప్రయోగం వాయిదా... జీఎస్ఎల్వీ మార్క్-3లో టెక్నికల్ సమస్య
చంద్రయాన్-2 ప్రయోగం వాయిదాపడింది. చివరి నిమిషమంలో చంద్రయాన్-2ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్-3లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారు. తదుపరి ఎపుడు ప్రయోగిస్తారన్నది తర్వాత వెల్లడించనున్నారు.
నిజానికి ప్రపంచం మొత్తం చంద్రయాన్ ప్రయోగం పట్ల ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ ప్రయోగం కోసం కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైంది. అయితే, ప్రయోగానికి సరిగ్గా 55 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను ఇస్రో నిలిపివేసింది. ప్రయోగా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసింది. ఆపై ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
చంద్రయాన్-2ను మోసుకెళ్లే వాహకనౌక జీఎస్ఎల్వీ మార్క్-3లో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని వాయిదావేశారు.అయితే, ప్రయోగం తిరిగి ఎపుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రయోగిస్తామని ఇస్రో ప్రకటించింది.
కాగా, ఈ ప్రయోగం సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు జరగాల్సివుంది. మరికొన్ని గంటల్లో కౌంట్‌డౌన్ కూడా పూర్తికావచ్చింది. ప్రయోగం అనుకున్న సమయానికి జరిగి ఉంటే చంద్రయాన్-2 ఈసరికి నిర్ణీత కక్ష్యలో చేరి ఉండేది. ప్రయోగాన్ని మళ్లీ చేపట్టాలంటే అందుకు అనువైన సమయం (లాంచ్ విండో) దొరికితే తప్ప సాధ్యం కాదు.
సోమవారం 10 నిమిషాల పాటు లాంచ్ విండో అందుబాటులో ఉండడంతోనే ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడది నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడన్నది ఆసక్తిగా మారింది. ఈ నెలలో 10 నిమిషాల నిడివి వున్న లాంచ్ విండోలు లేవు. అన్నీ నిమిషం నిడివి ఉన్నవే ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో ప్రయోగాన్ని తిరిగి ఈ నెలలోనే చేపట్టే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.