ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (23:32 IST)

జిల్లా కలెక్టరు గంధం చంద్రుడును అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తాడిపత్రి తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'చంద్రుడూ.. గుడ్ జాబ్' అంటూ జిల్లా కలెక్టరు గంధం చంద్రుడును అభినందించారు.

కోవిడ్ కష్ట కాలంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిని నిర్మించిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంలో పాలు పంచుకున్న అర్జాస్ స్టీల్స్, మేఘా గ్రూప్ మరియు ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 
 
ఆసుపత్రిలో డాక్టర్లు అవసరమైతే స్వతహాగా డాక్టర్లైన ఎమ్మెల్యేలైన మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యమంత్రి నుంచి అభినందనలు దక్కడపై జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే వారికి బెడ్డు లేదు అని ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, అహర్నిశలూ పని చేశామని, కేవలం రెండు వారాల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయగలగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కష్టానికి ముఖ్యమంత్రి నుంచి అభినందన దక్కడం బోనస్ అన్నారు.
 
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ .. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో కడప, కర్నూలు జిల్లాల ప్రజలకు పడకలు కేటాయిస్తామన్నారు. కేవలం 14 రోజుల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం జరిగిందన్నారు. ఆక్సిజన్ అందిస్తున్న అర్జాస్ స్టీల్స్,  ఆక్సిజన్ సరఫరా కోసం కాపర్ పైపులు అందించిన మేఘా గ్రూప్ మరియు స్థల దాతలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.