శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (11:43 IST)

నారాయణపై సీఐడీ కన్ను

'నారాయణ' విద్యాసంస్థల అధిపతిగా 'పొంగూరు నారాయణ' చిరకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ 'నారాయణ' విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు విద్యాబోధనలను నేర్పినవాడిగా గుర్తింపు ఉంది. విద్యా సంస్థల అధిపతిగా ఎలా పేరు ఉందో టిడిపి అధినేత 'చంద్రబాబునాయుడు'కు అత్యంత సన్నిహితుడిగా కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో పేరు ఉంది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలిచిన వెంటనే 'నారాయణ'కు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు 'చంద్రబాబునాయుడు'. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు.

టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు 'నారాయణ' మున్సిపల్‌ మంత్రిగా పనిచేశారు. ఈయన హయాంలోనే అప్పట్లో ప్రపంచ రాజధానిగా చెప్పుకున్న 'అమరావతి' నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది. 
 
రాజధాని ప్రాంతం గుర్తింపు దగ్గర నుంచి భూముల సేకరణ, నూతనంగా సిఆర్‌డిఎ వ్యవస్థను నెలకొల్పడం, రాజధానిలో భవనాలు, మౌళిక వసతులు ఏర్పాటు చేయడం వంటి ప్రతిష్టాత్మకమైన పనులను ఆయన మంత్రిగా పర్యవేక్షించారు.

ఆయన హయాంలో రాజధాని ప్రాంతంలో దాదాపు రూ.10వేల కోట్ల పనులు జరిగాయని చెబుతారు. అయితే ఇప్పుడు అవే పనులు ఆయనపై కేసులు నమోదు కారణం అవుతున్నాయి. 'చంద్రబాబు, నారాయణ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు రాజధాని ప్రాంతంలో ముందుగానే భూములు కొనుగోలు చేసి తరువాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని, ఇది ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ కిందకు వస్తుందని తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేసులు పెడుతోంది.

దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో భాగంగా సీఐడీ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు అప్పటి మున్సిపల్‌ మంత్రి అయిన 'నారాయణ'కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 
 
కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి 'నారాయణ' ఎక్కడా కనిపించడం లేదు. టిడిపి వ్యవహారాల్లోనూ ఆయన కలుగ చేసుకోవడం లేదు. అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు.

'చంద్రబాబు' అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై చక్రం తిప్పిన 'నారాయణ' ఇప్పుడు టిడిపి వ్యవహారాల్లో కలుగచేసుకోవడానికి కారణం ఏమిటో తెలియదు కానీ, ఆయన మాత్రం 'టిడిపి' బృందంలో కలవడం లేదు. కేసుల భయంతో ఆయన టిడిపికి దూరంగా ఉంటున్నారని కొందరు చెబుతున్నా..ఆయన మాత్రం ఎక్కడా నోరెత్తడం లేదు.

అసలు 'నారాయణ' అనే వ్యక్తి గతంలో కీలకంగా వ్యవహరించారనే సంగతే రాజకీయ,మీడియా వర్గాలు మరిచిపోయాయి. అయితే ఇప్పుడు సీఐడీ నోటీసుల పుణ్యాన ఆయన బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. 'చంద్రబాబు'తో కలసి ఆయన కూడా సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

మరి ఇప్పుడు ఈ విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. కాగా కొంత మంది ఆయన ముఖ్యమంత్రి జగన్‌తో రాజీ చేసుకున్నారని, తాను ఇక రాజకీయాల్లోకి రానని, తన వ్యాపారాలు తాను చేసుకుంటానని, తనను వేధించవద్దని రాజీ చేసుకున్నారని చెబుతున్నారు.

ఆయన కుమార్తె సిఎం జగన్‌ను కలిసిందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంతో తెలియదు. ఏది ఏమైనా చాలా కాలం తరువాత గతంలో రాజధాని విషయంలో గిరగిరా చక్రం తిప్పిన 'నారాయణ' బయటకు రావాల్సిన పరిస్థితి వస్తోంది. అన్నట్లు ఈయన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే 'గంటా శ్రీనివాసరావు'కు వియ్యంకుడు.