సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (15:16 IST)

గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపేసిన అచ్చెన్న - సీంఎం జగన్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ఈ సమావేశాలు ఆరంభమయ్యాయి. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రతులను ప్రధాన విపక్ష టీడీపీకి చెందిన సభ్యులు చింపివేశారు. 
 
ముఖ్యంగా, గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేయడం అంటే ఆయన్ను అవమానించడమేనని పేర్కొంటూ అచ్చెన్నాయుడుపై సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడాన్ని జగన్ తప్పుబట్టారు. 
 
గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 
 
ఈ సమయంలోనే అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మీ పార్టీ కాదు, మా పార్టీకాదు. ఆయన ప్రసంగ ప్రతులను చింపివేసి, వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని, గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని అన్నారు. 
 
కాగా, సోమవారం సమావేశమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ హరించన్ అసెంబ్లీకి వచ్చి ప్రసంగించారు. అపుడు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకొచ్చి గవర్నర్ ప్రతలును చింపివేశారు. ఆ తర్వాత సభలోనే నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. దీంతో స్పీకర్ ఆదేశం మేరకు సభ నుంచి వారిని బయటకు పంపించేశారు.