గుంటూరు టూర్: ఐటీసీకి స్టార్ హోటల్‌కు జగన్ రిబ్బన్ కటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఐటీసీకి చెందిన స్టార్ హోటల్‌కు జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. ప్రముఖ సంస్థ ఐటీసీ గుంటూరులో స్టార్ హోటల్‌ను నిర్మించింది.
గుంటూరు పట్టణంలోని విద్యానగర్‌లో ఈ హోటల్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఐటీసీ హోటల్‌కు ప్రతిష్టాత్మకమైన ఈ హోటల్‌ను ముఖ్యమంత్రి జగన్ బుధవారం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
బుధవారం ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకోనున్నారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్‌కు బయలుదేరతారు. 11గంటలకు హోటల్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ 45 నిమిషాల పాటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.
సీఎం పర్యటన సందర్భంగా గుంటూరు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్, పట్టాభిపురం, స్థంబాలగరువు, గుజ్జనగుండ్ల, విద్యానగర్ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.