ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీ.. జగన్ ఆదేశాలు
ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలియజేయగా.. అదే సమయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని సీఎం అన్నారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్ రాక్స్, పుస్తకాలు, మేగజైన్‌ల ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు.
రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు నిర్మాణం చేపడుతున్నామని, మూడు దశల్లో విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. తొలి విడతలో చేపడుతున్న 4530 విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎంకు వివరించారు.
ఉగాది నాటికి ఫేజ్1లో కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు 2022 నాటికి ఫేజ్2 పూర్తి చేసేలా కార్యాచరణ చేయాలన్నారు. జూన్ 2023 నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అన్‌ఇంటరెప్టడ్ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.