రాష్ట్ర విభజన గాయాలు మానలేదు... ప్రత్యేక హోదా ఇవ్వండి ప్లీజ్-సీఎం జగన్
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత మూడేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో సాగుతున్నాయన్నారు.
ఈ విషయంలో కేంద్రం సహకారం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. విభజన వల్ల ఏర్పడిన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోలుకోలేదని, ఆ గాయాలు మానేందుకు రాష్ట్రానికి సహకరించాలని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు.
రాష్ట్రానికి మంజూరైన ప్రతి రూపాయి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహాయాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన గాయాలు మానలేదని.. కాబట్టి దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండంటూ విజ్ఞప్తి చేశారు.