1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 మే 2021 (09:35 IST)

నేడే వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన... ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం

నవరత్నాలులో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో పాటు, వైద్య ఆరోగ్య రంగానికి కూడా పెద్ద పీట వేసిన సీఎం వైయస్‌ జగన్, తొలి నుంచి ఆ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పరిధిని విసృతంగా పెంచడం, రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక, వైద్యులు సూచించినంత కాలం వారికి ఆర్థికంగా అండగా నిలుస్తూ, వైయస్సార్‌ ఆరోగ్య ఆసరాను అమలు చేయడంతో పాటు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆ దిశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు చివరకు టీచింగ్‌ ఆస్పత్రుల వరకు అన్నింటిలో ప్రమాణాలు పూర్తిగా మెరుగుపర్చడం, వాటిలో అన్ని సదుపాయాలు కల్పించడం, అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు, గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో 108, 104 సర్వీసుల్లో ఒక ప్రభంజనం సృష్టించారు.
 
రాష్ట్రంలో ఆస్పత్రులు:
రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 198 కమ్యూనిటీ ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 14 జిల్లా ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఆ దిశలోనే నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో అన్ని వైద్య సదుపాయాల కల్పన చేపడుతోంది.
 
వైద్య కళాశాలలు:
రాష్ట్రంలో ప్రస్తుతం 11 వైద్య కళాశాలలు, రెండు డెంటల్‌ కాలేజీలతో పాటు, 10 నర్సింగ్‌ కళాశాలలు ఉండగా, కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల్లో ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు మొదలు కాగా, సోమవారం నాడు మిగిలిన 14 టీచింగ్‌ ఆస్పత్రుల పనులకు సీఎం వైయస్‌ జగన్‌  శ్రీకారం చుట్టనున్నారు. 
 
ఎక్కడెక్కడ కొత్త మెడికల్‌ కాలేజీలు:
పాడేరు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, అదోని, నంద్యాలలో దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వైద్య కళాశాల వెంట నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వీటన్నింటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు, 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్టు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల పనులు మొదలు పెట్టినుందువల్ల, మిగిలిన 14 వైద్య కళాశాలల పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శిలా ఫలకాలు ఆవిష్కరిస్తారు. 2023 చివరి నాటికి వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి కానుంది.
 
వైద్య కళాశాలలు–అత్యాధునిక వసతులు:
– ప్రతి మెడికల్‌ కాలేజీలోనూ 500 పడకలు తగ్గకుండా ప్రత్యేక సర్వీసులతో కూడిన ఏర్పాట్లు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్‌ సర్వీసులు.
– ఐటీ సర్వీసులు, సీసీ కెమెరాలు అనుసంధానం.
– ప్రతి కాలేజీలోనూ, అనుబంధ ఆసుపత్రిలో 10 మోడ్యులర్‌ ఆపరేషన్‌ ధియేటర్లు.
– సెంట్రలైజ్డ్‌ ఏసీతో కూడిన ఐసీయూ, ఓపీడీ రూమ్స్, డాక్టర్‌ రూమ్స్‌
అన్ని పడకలకు మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్లు ఏర్పాటు.
– ఆక్సిజన్‌ స్టోరేజి ట్యాంకులతో పాటు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు.
– నర్సింగ్‌ కాలేజీ మరియు హాస్పిటల్‌.