బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (10:47 IST)

విధుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం... యువకుడి మృతికి రూ.40 లక్షల పరిహారం..

court
తమ విధులను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ యువకుడిని మృతి కారణమమైన ఆస్పత్రితో పాటు ముగ్గురు వైద్యులకు వినియోగదారులఫోరం కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వైద్య సేవల్లో లోపం కారణంగా చనిపోయిన యువకుడి మృతికి రూ.40 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం కోర్టు ఆదేశించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖపట్టణానికి చెందిన శీలా తులసీరామ్‌ (26) అనే యువకుడు 2013 అక్టోబరు 8వ తేదీన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ స్థానికంగా ఉండే క్వీన్ ఆస్పత్రికి చికిత్స కోసం వెల్లారు. ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు.. అపెండిక్స్ నొప్పితో బాధపడుతున్నాడని, తక్షణం ఆపరేషన్ చేయాలంటూ యువకుడి తల్లిదండ్రులకు చెప్పారు. వారు భయపడిపోయి... అదేరోజు రాత్రి 9 గంటలకు ఆపరేషన్ చేశారు. తర్వాత యువకుడు అపస్మారక స్థితిలోనికి వెళ్లాడు. ఐసీయూలో ఉంచిన తులసీరాం పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియనీయలేదు. కేసు రికార్డులు చూపించేందుకూ నిరాకరించారు.
 
చివరికి తులసీరాం కోమాలోనికి వెళ్లారని వైద్యులు వెల్లడించారు. అదేనెల 12న యువకుడు ప్రాణాలు విడిచాడు. తులసీరాంకు ఇతర అనారోగ్య సమస్యలు లేవని, ఎలా చనిపోతాడని బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు వినియోగదారుల కమిషన్‌ను 2015లో ఆశ్రయించారు. 
 
వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు విడిచారని, ఆసుపత్రి యజమాన్యం, చికిత్స అందించిన వైద్యుల నుంచి రూ.99,99,000 పరిహారం కింద ఇప్పించాలని కోరారు. ఘటనకు బాధ్యులుగా క్వీన్స్‌ ఎన్నారై ఆసుపత్రి, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ టీఎస్‌ ప్రసాద్‌, మత్తుమందు వైద్యులు డాక్టర్‌ తనూజ రాజ్యలక్ష్మిదేవి, డాక్టర్‌ రవిచంద్రహాస్‌లను పేర్కొన్నారు. 
 
కమిషన్‌ జారీచేసిన తీర్పులో రికార్డుల్లో చికిత్స వివరాలు నమోదు చేయలేదన్న విషయాన్ని వైద్యురాలు తనూజ అంగీకరించారని పేర్కొంది. వైద్యసేవల్లో లోపం కారణంగా తులసీరాం మరణించినట్లు స్పష్టం చేసింది.
 
ఈ కేసుపై విచారణ జరిపిన ఏపీ వైద్య మండలి కూడా మెడికల్‌ రిజిస్టర్‌ నుంచి డాక్టర్‌ తనూజ పేరును 6 నెలలపాటు తొలగించింది. మృతుడి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మానవ హక్కుల కమిషన్‌ ద్వారా కేజీహెచ్‌ వైద్యుల బృందం ఈ ఘటనపై విచారణ జరిపి, వైద్య సేవల్లో యాజమాన్యం లోపం, మత్తుమందు వైద్యుల నిర్లక్ష్యం ఉందని పేర్కొంది. వీటిని కూడా కమిషన్‌ పరిగణనలోనికి తీసుకుంది. పరిహారంగా రూ.40 లక్షలు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.