శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:23 IST)

ఢిల్లీ ఎన్జీ తిట్టినంతగా నా భార్య కూడా తిట్టలేదు : అరవింద్ కేజ్రీవాల్

arvind kejriwal
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ఎల్జీ ఇరుకున పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీను ఉద్దేశించిన కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. 
 
"ఎల్జీ సాబ్‌ నన్ను రోజూ తిట్టినంతగా నా భార్య కూడా తిట్టదు. గత ఆరు నెలలుగా ఎల్జీ సాబ్‌ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా రాయలేదు. ఎల్జీ సాబ్‌ మీరు చిల్‌ అవ్వండి.. మీ సూపర్‌ బాస్‌ని కూడా కొంచెం చిల్‌ చేయండి' అని పేర్కొంటూ కేజ్రీవాల్‌ గురువారం హిందీలో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 
ఇదిలావుంటే, గుజరాత్ ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టాలని భావిస్తున్న కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో భాగంగా, ఆయన ఢిల్లీలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం హామీ ఇచ్చారు. ఈ పథకంపై గుజరాత్ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. 
 
దీంతో ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ హామీ పథకంపై విచారణకు ఎల్జీ ఆదేశించారు. కేజ్రీవాల్‌ సర్కార్‌ ఇచ్చిన విద్యుత్‌ సబ్సిడీలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ను ఎల్జీ ఆదేశించారు. ఏడు రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని కోరారు. 
 
అయితే, ఎల్జీ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల స్పందించిన కేజ్రీవాల్‌.. ఆప్‌ ఉచిత విద్యుత్‌ హామీ గుజరాత్‌ ప్రజలు ఇష్టపడుతున్నారని.. అందుకే ఢిల్లీలో ఉచిత విద్యుత్‌ పథకాన్ని నిలిపేయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ పథకాన్ని ఆగనివ్వనని.. ఢిల్లీ ప్రజలంతా తనను నమ్మాలన్నారు.