శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (09:39 IST)

గుజరాత్‌లో ఆప్ దూకుడు.. ఆటో డ్రైవర్ ఇంట్లో డిన్నర్‌కు కేజ్రీవాల్ సై

auto driver - kejriwal
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇపుడు గుజరాత్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన గుజరాత్‌లో బీజేపీ గత 20 యేళ్లుగా అధికారంలో ఉంది. దీంతో అక్కడ అధికార మార్పిడికి నాంది పలకాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బలంగా భావిస్తున్నారు. అందుకే గుజరాత్‌పై ఫోకస్ పెట్టారు. ఈ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో గుజరాత్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 
 
ఇందులోభాగంగా, ప్రస్తుతం ఆయన గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమ ఇంటికి భోజనానికి వస్తారా? అని ఓ ఆటో డ్రైవర్ అడిగిన ప్రశ్నకు అరవింద్ కేజ్రీవాల్ సమ్మతం తెలిపారు. పైగా, మీ సొంత ఆటోలోనే మీ ఇంటికి భోజనానికి వెళ్దాం అంటూ చెప్పారు. పైగా, తనతో పాటు మరో ఇద్దరు కూడా మీ ఇంటికి భోజనానికి వస్తాం అంటూ సమాధానం ఇచ్చి, ఆ ఆటో డ్రైవర్‌కు ఎనలేని సంతోషాన్ని మిగిల్చాడు. 
 
ఈ యేడాది ఆఖరులో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అక్కడ పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముమ్మరంగా పర్యటనలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, అన్ని రంగాల వారితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, అహ్మదాబాద్‌ నగరంలో ఆయన ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల్లో తాను గెలవడం వెనుక ఆటో డ్రైవర్ల సహకారం ఎంతగానో ఉందని చెప్పారు. అలాగే, గుజరాత్ రాష్ట్రంలోనూ ఆటో డ్రైవర్లు ఆ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఇదిలావుంటే,  ఈ సమావేశంలో పాల్గొన్న విక్రమ్ దత్తా అనే ఆటో డ్రైవర్ మాట్లాడుతూ, తాను కేజ్రీవాల్‌కు వీరాభిమానిని అని చెప్పారు. పంజాబ్‌‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో చూశానని.. అలా తమ ఇంటికి భోజనానికి వస్తారా? అని అడిగాడు.
 
ఈ ఆటో డ్రైవర్ విజ్ఞప్తికి కేజ్రీవాల్ అక్కడే స్పందించారు. 'తప్పకుండా వస్తా. నాతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా మీ ఇంటికి భోజనానికి వస్తారు. రాత్రి 8 గంటలకు నీ ఆటోలోనే మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్తావా?' అని అడిగారు. కేజ్రీవాల్ అలా జవాబివ్వడంతో ఉబ్బితబ్బిబ్బయిన విక్రమ్ దత్తా.. తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.