అరవింద్ కేజ్రీవాల్‌కు అధికారం తలకెక్కింది : అన్నా హజారే
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఉద్యమకారుడు, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అధికారం తలకెక్కిందని ఆరోపించారు. లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక వ్యవస్థల విషయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. అలాగే, మహిళల వ్యతిరేక లిక్కర్ పాలసీ తెచ్చారంటూ మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం నుంచి ఎదిగిన పార్టీ ఇది కాదంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌పై ఆయన స్పందించారు. "ఆప్ పార్టీ కూడా అన్ని పార్టీల్లా మారిపోయిందన్నారు. నువ్వు (కేజ్రీవాల్) ముఖ్యమంత్రివి అయిన తర్వాత తొలిసారి లేఖ రాస్తున్నా... ఎందుకంటే మీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మద్యం పాలసీ విషయంగా వచ్చిన వార్తలు నన్ను బాధించాయి. నాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో రాసిన స్వరాజ్ పుస్తకంలో ఎక్కడైనా స్థానికుల అనుమతి లేకుండా లిక్కర్ దుకాణాలు పెట్టవద్దని కోరారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ మర్చిపోయావు. లిక్కర్ లాగే ్ధికారం కూడా నిషా ఇస్తుంది. నీకు ఆ అధికారం నిషా తలకు ఎక్కినట్టు కనిపిస్తుంది. మీరు స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మిగతా అన్ని పార్టీల్లాగే మారిపోయింది" అని హజారే వ్యాఖ్యానించారు.
ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ దేశంలో ఎక్కడా కూడా రావాల్సినది కాదు. అలాంటి దానిపై అవగాహన కల్పించాల్సిన విషయాన్ని పక్కన పెట్టేశారు. బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలను పక్కనపట్టేశారని ఆయన ఆరోపించారు. మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తెచ్చి, ఢిల్లీలోని ప్రతి మూలమూలనా మద్యం దుకాణాలను తెరిచారని అన్నా హజారే మండిపడ్డారు.