బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:22 IST)

మంగళగిరి రూరల్ గ్రామాల్లో కరోనా పంజా, ఏమాత్రం భయం లేకుండా షాపులు తెరిచేస్తున్నారు

మంగళగిరి రూరల్: మంగళగిరి మండలంలో కరోనా పంజా విసురుతోంది. గతంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయనిపించినా... ఇటీవల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. వేసవి కాలంలోనూ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నది.

15 రోజుల నుంచి పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఓవైపు నిర్ధారణ పరీక్షలు.. మరోవైపు నివారణ చర్యలు.. ఇంకోవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. మహమ్మారి మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలని, అప్పుడే ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉన్నదని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకోవాలని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరస్‌వ్యాప్తి 15 రోజులుగా తీవ్రంగా ఉన్నదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని పేర్కొంటున్నారు. ప్రజలు నిర్లక్ష్యం వీడాలని, కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని వారు కోరుతున్నారు. ఫంక్షన్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవడం మంచిదని, గుంపులుగా ఉండకూడదని వివరిస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.
 
గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకూ దుకాణాలా?
మండలంలోని ఆయా గ్రామాల్లో నానాటికీ కరోనా విజృంభిస్తోన్నా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తోన్నారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఇప్పటికే తాడేపల్లి, పెదకాకాని మండలాల్లో దుకాణాలు ఉదయం 11 గంటలకే మూసివేయించి కరోనా కట్టడికి స్థానిక అధికారులు తగు చర్యలకు ఉపక్రమించారు.

మంగళగిరి మండలంలోని గ్రామాల్లో మాత్రం  దుకాణాలు రాత్రి 10 గంటల వరకూ యథేశ్చగా కొనసాగుతోన్నా అధికారులు మిన్నకుండిపోతోన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి  మండలంలోని గ్రామాల్లో వ్యాపార దుకాణాలకు సమయ పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.