గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (12:26 IST)

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు...

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అలాగే, 75 వైరస్ ప్రభావిత జిల్లాల్లో కూడా కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, లాక్ డౌన్ అంటే ఏంటి, దాన్ని ఎపుడు అమలు చేస్తారనే విషయాన్ని పరిశీలిస్తే, 
 
దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, నిర్దేశిత ప్రాంతంలోని ప్రజలను నియంత్రించేందుకు ఇచ్చే అధికారిక ఆదేశాన్ని లాక్‌డౌన్‌ అంటారు. దీని ప్రకారం ఆయా నిర్ధిష్ట ప్రాంతంలోని ప్రజలు ఎక్కడికక్కడే ఉండాలి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇతర ప్రాంతాలవారు అక్కడికి రావటం నిషిద్ధం. 
 
అత్యవసర సేవలు, సరుకుల పంపిణీ, మెడికల్‌, బ్యాంకులు.. తదితర సేవలు కొనసాగుతాయి. ఇతర సేవలన్నీ నిర్దిష్ట కాలానికి నిషేధిస్తారు. కరోనా నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
 
ఎవరైనా ఈ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. గరిష్టంగా 30 రోజులపాటు సాధారణ జైలుశిక్ష లేదా రూ.200 వరకు జరిమానా లేదా రెండూ ఏకకాలంలో విధించే అవకాశం ఉంటుంది.
 
అలాగే, అన్ని ప్రైవేటు కంపెనీలు తమ సిబ్బందికి వర్క్‌  ఫ్రం హోం అవకాశం కల్పించాయి. అన్ని కార్యాలయాలు తప్పనిసరిగా మూసివేయాల్సి ఉంటుంది. అత్యవసర వేళలో అతి తక్కువ సిబ్బందితో పనిచేసే వెసులుబాటు మాత్రమే ఉంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.