శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By బిబిసి
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:10 IST)

కోవిడ్: ‘ఆసుపత్రుల బయట రోడ్లపైనే ప్రాణాలు వదులుతున్నారు’

భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతితో రోగులకు ఆసుపత్రులలో బెడ్‌లు దొరకడం లేదు. మృతులకు అంతిమ సంస్కారాలు చేసేందుకూ చోటు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో పాటు, ఆక్సిజన్, మందుల కొరత కొనసాగుతోంది.

 
దేశంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
దేశంలో కొత్త వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం అత్యధికంగా కొత్త కేసులు 3,79,257 నమోదయ్యాయి. అలాగే, అత్యధిక మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. ఒక్క రోజులోనే 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు.

 
చాలామంది చేయించుకున్న కోవిడ్ పరీక్షల ఫలితాలు వెలువడకపోవడం వల్ల, టెస్టింగ్ చేయించుకోవడానికి అవకాశం దొరకకపోవడం వల్ల కేసుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే ఎక్కువే ఉండొచ్చని అంచనా. మరణాల విషయంలోనూ అంతే.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మరణాలు నమోదు కావడం లేదు. దిల్లీ ఆసుపత్రుల బయట ప్రజలు ఎలా మరణిస్తున్నారో డాక్టర్లు చెబుతున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు 1.8 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడగా 2 లక్షల మందికి పైగా మరణించారు. మరో రెండు మూడు వారాలలో ఈ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని వైరాలజిస్టులు చెబుతున్నారు.

 
అతి తక్కువ క్రిటికల్ కేర్ బెడ్స్
దేశంలోని ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు తగినన్ని క్రిటికల్ కేర్ బెడ్‌లు లేవు. దీంతో, ఆసుపత్రిలో ఒక బెడ్ సంపాదించడానికి చాలా కుటుంబాలు కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సివస్తోంది. 2 కోట్ల జనాభా ఉన్న దిల్లీ నగరంలో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. కొత్తగా ఎవరినీ చేర్చుకోవటం లేదు. దిల్లీ లోని ఆసుపత్రుల బయట ఉన్న వీధులు కరోనా రోగులతో నిండిపోయాయి. వారికి స్ట్రెచర్ కానీ, ఆక్సిజన్ కానీ అందించేందుకు , ఆసుపత్రిలో చోటు సంపాదించేందుకు ఆప్తులు ఆసుపత్రి వర్గాలను బతిమాలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

 
ఒక వ్యక్తి తన భార్య కోసం ఆసుపత్రిలో బెడ్ కావాలని మూడు రోజులుగా తిరుగుతున్నాట్లు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. మిలటరీ వైద్య సదుపాయాలు సాధారణ పౌరులకు కూడా అందుబాటులోకి వస్తాయని.. అలాగే, రిటైర్ అయిన మిలటరీ ఉద్యోగులు కూడా కోవిడ్ కేంద్రాల్లో సహాయం అందిస్తారని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

 
ఆక్సిజన్ కొరత
దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కొనసాగుతోంది. కొంతమంది ఆక్సిజన్ లేదంటూ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ డిమాండ్ మరే ఇతర దేశాల్లోనూ లేనంతగా ఉందని పాత్ (పీఏటీహెచ్) ఆక్సిజన్ నీడ్స్ ట్రాకర్ పేర్కొంది. దిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి కోవిడ్ వార్డులో పనిచేసే డాక్టర్ హర్జిత్ సింగ్ భట్టి మాట్లాడుతూ.. ప్రజలు ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారని, నీళ్ల నుంచి బయట పడిన చేపల్లా విలవిలలాడుతున్నారని అన్నారు.

 
''ఆక్సిజన్ దొరకడం లేదు.. ఆక్సిజన్ కోసం అల్లాడుతూ రోడ్లపైనే ప్రాణాలు వదులుతున్నారు'' అన్నారాయన. సాధారణ పరిస్థితుల్లో భారత్‌లో ఉత్పత్తయ్యే ఆక్సిజన్‌లో 15 శాతమే హెల్త్ కేర్ రంగంలో వాడుతారు, మిగతాదంతా పారిశ్రామిక అవసరాలకే వాడేవారు. కానీ, ఇప్పుడు దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి పూర్తి సామర్థ్యం మేరకు జరుగుతున్నా అదంతా వైద్య అవసరాలకు చాలడం లేదు.

 
దేశంలో రోజుకు సుమారు 7,500 టన్నుల ఆక్సిజన్ తయారవుతుంటే అదంతా వైద్య అవసరాలకే ప్రస్తుతం వాడుతున్నారని వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన సీనియర్ అధికారి రాజేశ్ భూషణ్ చెప్పారు. గత ఏడాది 4 వేల రైల్వే కోచ్‌లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 64,000 పడకలు ఇప్పుడు పనికి వస్తాయని భారతీయ జనతా పార్టీ ప్రతినిధి గోపాల్ అగర్వాల్ బీబీసీకి చెప్పారు

 
కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ ఏర్పాట్లు ఉన్న రైళ్లను అవసరమైన నగరాలకు, పట్టణాలకు పంపించవచ్చు. ఇందులో రోగులకు బాత్ రూములు , వైద్య పరికరాలకు అవసరమైన పవర్ పాయింట్లు కూడా ఉంటాయి. భారతీయ రైల్వేలకు రైళ్లలో ఆసుపత్రులను నిర్వహించిన అనుభవం ఉంది. 1991లో ప్రారంభించిన లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా ప్రయాణించి రోగులకు అవసరమైన వైద్య, శస్త్ర చికిత్స అవసరాలను తీర్చింది.

 
క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, ఆశ్రమాలు కూడా ఆసుపత్రులుగా మారాయి. ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, ఆశ్రమాలను కూడా ఆసుపత్రులుగా మారుస్తున్నారు. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం, గౌహతిలో ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియం, దిల్లీలోని రాధా స్వామి సత్సంగ్ బియాస్ కేంద్రాలను క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నారు.

 
గత సంవత్సరం దిల్లీలో కేసులు పెరిగినప్పుడు రాధా స్వామి సత్సంగ్ సంస్థకు చెందిన ప్రాంగణాన్ని 10,000 బెడ్లతో కూడిన సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ కేంద్రంగా మార్చారు. అందులో 1000 ఆక్సిజన్ బెడ్‌లు ఏర్పాటు చేశారు. అది ఫిబ్రవరిలో మూసేసేనాటికి 11,000 మందికి చికిత్స అందించారు. 20 ఫుట్ బాల్ మైదానాల వైశాల్యం ఉండే ఈ కేంద్రంలో ముందు 2500 పడకలతో ప్రారంభించి 5000కి పెంచాలని ఆలోచిస్తున్నారు.

 
ఈ కార్డు బోర్డు బెడ్లను ఆర్యన్ పేపర్ తయారు చేస్తోంది. ఈ ఎమర్జెన్సీ బెడ్లను దృఢమైన కార్డు బోర్డుతో తయారు చేసినట్లు చెప్పారు. అవి చవకైనవి, రీసైకిల్ చేసే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభంలో అవి చాలా ఉపయోగపడుతున్నాయి. వీటిని త్వరగా ఎక్కడికైనా తరలించి అయిదు నిమిషాల్లోనే తిరిగి అమర్చవచ్చు.

 
సామూహికంగా దహన సంస్కారాలు
భారతదేశంలో కోవిడ్ మరణాలు ఎక్కువవుతూ ఉండటంతో సామూహిక దహన సంస్కారాలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రదేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక భవనం కారు పార్కింగ్‌లో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల సామూహిక దహన సంస్కారాలు జరుగుతున్నాయి. పగలూ రాత్రి సిబ్బంది పని చేయాల్సి వస్తోంది.

 
లెక్కలేనన్ని శవాలు రావడంతో ఈశాన్య దిల్లీలో దహన వాటిక కేంద్రాన్ని నడుపుతున్న ఒక స్వచ్చంద సంస్థ అధిపతి జితేందర్ సింగ్ షన్టీ దహన వాటికకు పక్కనే ఉన్న కారు పార్కింగ్‌లో కూడా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. "ఇదంతా చూడటం చాలా కష్టంగా ఉంటోంది" అని ఆయన అన్నారు. చాలా చోట్ల శవాలను కాల్చేందుకు కట్టెలు కూడా దొరకటం లేదు.

 
ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక దహన వాటిక దగ్గర సహాయ చర్యలు చేపడుతున్న జయంత్ మల్హోత్రా బీబీసీతో అన్నారు. "మనం దేశ రాజధానిలో ఉన్నామనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ప్రజలకు ఆక్సిజన్ దొరకక జంతువుల్లా చనిపోతున్నారు" అని ఆయన అన్నారు.