సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:31 IST)

కోవిడ్: ఇంట్లోనూ మాస్క్ ధరించడం వల్ల ఫలితం ఉంటుందా? 24 గంటలూ మాస్క్ ధరించడం సాధ్యమేనా?

''ఇంట్లో కూడా మాస్క్ ధరించే సమయం వచ్చేసింది'' అని నీతీ ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వి.కె.పాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లతో ఇంట్లో కూడా వైరస్ నుంచి మనుషులకు రక్షణ లేదా అన్న చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగిలిన వాళ్లు మాస్క్ ధరించాలనడం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరికీ వైరస్ లేకపోయినా ఇంట్లో కూడా ముక్కు, నోరు కవర్ చేసుకోవాల్సి రావడం అవసరమేనా?

 
ఈ సలహా ఉపయోగకరమైనదేనా?
ఇంట్లో మాస్క్ ధరించడం గురించి తెలుసుకోవడానికి కొంతమంది నిపుణులతో బీబీసీ మాట్లాడింది. దీంతో పాటు కోవిడ్‌కు సంబంధించిన అనేక అంశాలపై వారితో చర్చించింది. ఇంట్లో కూడా మాస్కు ధరించడం వల్ల నష్టం ఏమీ లేదన్నారు వైద్య నిపుణులు. ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, కుటుంబాలకు కుటుంబాలనే చుట్టేస్తుండటంతో ఇది కొంతవరకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

 
''మనది జనాభా ఎక్కువగా ఉన్న దేశం. చాలా నగరాల్లో కుటుంబాలు ఓకే ఇంట్లో లేదంటే ఒకే గదిలో కలిసి ఉంటుంటాయి. అలాంటి వారు ఈసారి త్వరగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది'' అని డాక్టర్ హిమాన్షు వర్మ బీబీసీతో అన్నారు. ఆయన గుర్‌గ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జరీ విభాగంలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

 
''ఇంట్లో ఎవరికైనా వైరస్ సోకినా, లేదంటే జనం ఎక్కువగా తిరుగాడే ప్రాంతం, అపార్ట్‌మెంట్‌లాంటి వాటిలో ఉన్నప్పుడు ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుని ఉండటం మంచిది'' అన్నారాయన. ''మేం ఇప్పటికే చాలామందికి ఈ సలహా ఇచ్చాం'' అని డాక్టర్ రాజేశ్ చావ్లా బీబీసీతో అన్నారు. చావ్లా దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్‌ విభాగంలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

 
'' ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లకపోతే మంచిదే. కానీ ఎవరైనా బయటకు వెళ్లి వచ్చే వాళ్లుంటే, వారు ఇన్‌ఫెక్షన్‌ను మోసుకొచ్చే అవకాశం ఉంటుంది. వారిలో లక్షణాలు లేకపోవచ్చు. కానీ వైరస్ ఇంట్లోని మిగిలిన వారికి సోకుతుంది'' అన్నారు రాజేశ్ చావ్లా. అస్సలు బయటకు వెళ్లని వారు, ఇతర వ్యక్తులతో సంబంధాలు లేని వారైతే ఇళ్లలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. కానీ సాధారణంగా ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి సామాన్ల కోసం బయటకు వెళ్లాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మాస్క్ ధరించడమే మంచిదన్నది నిపుణుల సూచన.

 
మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తి చైన్ తెగిపోతుందా
అవుననే అంటున్నారు డాక్టర్ హిమాన్షు. వైరస్ చైన్‌ను తెంచడానికి కొట్టడానికి ఇదొక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని ఆచరించడం చాలా కష్టమైన విషయం. 24 గంటలూ మాస్క్‌ ధరించి ఎలా ఉండగలమని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే, గదిలో ఒంటరిగా ఉంటే మాస్క్ అవసరం లేదని, అలాగే అప్పుడప్పుడు చేతులు కడుక్కోవడం మంచిదని నిపుణులు చెప్పారు.

 
కుంభమేళా, ఎన్నికల తర్వాత ప్రజలలో ఏమీ కాదు అన్న భావన ఏర్పడిందని, దీని నుంచి బయటపడాలని డాక్టర్ హిమాన్షు సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రజలు ప్రభుత్వం సూచించినట్లుగా మాస్కులు ధరిస్తే ఆ పరిస్థితి రాకుండా చూడొచ్చని కూడా ఆయన అన్నారు. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు కామెంట్లు చేయడం, తాము ఏదో ఒకటి చేస్తున్నట్లు ప్రజలను నమ్మించడానికేనని డాక్టర్ హిమాన్షు అన్నారు.

 
టీకా తీసుకున్నా ఇంట్లో మాస్క్ ధరించాలా ?
ఈ విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సూచనలు జారీ అయ్యాయని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ గగన్‌దీప్ ‘హిందుస్తాన్ టైమ్స్‘ పత్రికతో అన్నారు. టీకా వేసుకున్నా ఇంట్లో మాస్క్ అక్కర్లేదని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ తేల్చి చెప్పింది. అంటే వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నమాట.

 
ఎలాంటి మాస్క్ ధరించాలి ?
ఎన్-95 మాస్కులు ఖరీదైనవి, అందరూ కొనలేరు. డాక్టర్ గగన్‌దీప్ అభిప్రాయం ప్రకారం రంథ్రాలు లేని ఎన్-95 మాస్క్‌లు చాలా మంచివి. సర్జికల్ మాస్క్, లేదంటే ఎన్-95 మాస్క్ ఏదైనా మంచిదేనని, డబుల్ మాస్క్ వేసుకున్నప్పుడు రెండు మాస్క్‌లు దూర దూరంగా ఉంటే ఉపయోగం లేదని డాక్టర్ హిమాన్షు చెప్పారు.

 
వైరస్ గాలిలో తిరుగుతుందా?
ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని చెప్పినప్పుడు, అందరిలో కలిగే సాధారణ సందేహం...వైరస్ గాలిలో తిరుగుతూ ఉంటుందా అన్నది. కిటికీలు, తలుపులు, వెంటిలేటర్ల ద్వారా ఇంట్లోకి వచ్చి వైరస్ మనుషులకు సోకుతుందా అని చాలామంది అడుగుతున్నారు. అయితే అది నిత్యం గాలిలో జీవించి ఉండకపోయినా, గాలి ద్వారా వ్యాప్తి చెందడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 
''రద్దీగా ఉండే ప్రదేశాలు, అపార్ట్‌మెంట్లలో ఉండేవారు, ఇంట్లో ఎక్కువమంది తిరిగే పరిస్థితులు ఉంటే నిత్యం మాస్క్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అది గాలిలో చక్కర్లు కొడుతూ వ్యాప్తి చెందుతోంది. అంటే మన చుట్టూ ఉన్న గాలిలో వైరస్ ఉంది'' అన్నారు డాక్టర్ హిమాన్షు. ఈ వైరస్ ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదని డాక్టర్ హిమాన్షు ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వివరించారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇది అణువుకన్నా చిన్న తుంపరలుగా గానీ, పెద్ద తుంపరలుగా గానీ రావచ్చని తన కథనంలో పేర్కొన్నారు.

 
మొదట్లో ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని అనుకున్నారు. కానీ తుంపరల ద్వారా ఒక మనిషి నుంచి మరొక మనిషికి వైరస్ చేరుతుందని గుర్తించారు. శ్వాస వదిలే సమయంలో ఆ గాలి నుంచి వచ్చే తుంపరలు గాలిలో చేరతాయి. అవి ఇతరులకు సోకకుండా ఉండేందుకే ఆరడుగుల దూరం పాటించాలని సూచించారు.

 
గాలిలో సూక్ష్మ తుంపరలు
వైరస్ సోకిన వ్యక్తి ఎక్కువ సేపు మూసిఉన్న గదిలో ఉంటే అతని శ్వాస నుంచి వచ్చిన అణువులు గాలిలో చేరతాయి. వాటిని పీల్చినప్పుడు మనకు కూడా వైరస్ రావచ్చు. వెంటిలేషన్ ఎక్కువగా ఉండటం వల్ల గాలిలోని ఈ అణువులు త్వరగా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అయితే కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయని డాక్టర్ హిమాన్షు అన్నారు. ''మూసివేస్తే లోపల ఉన్నవారికి సోకే ప్రమాదం ఉండగా, తెరిచినప్పుడు అది బయటకు వెళ్లి ఇతరులకు అంటుకోవచ్చు. కిటికీలు, తలుపులు మూయడం ఒక విధంగా కరెక్ట్'' అన్నారు డాక్టర్ హిమాన్షు.

 
ఇంటి నుంచి బయటికి రాకున్నా కొందరికి ఎలా సోకుతోంది?
దీనికి రెండు కారణాలు ఉండొచ్చని డాక్టర్ గగన్‌ దీప్ అన్నారు. ఒకటి... వైరస్ సోకిన వారు ఎవరైనా ఇంటికి రావడం వల్ల కావచ్చు. రెండోది... మనతో ఉన్నవారిలో లక్షణాలు లేని పాజిటివ్ కేసులు ఉండొచ్చు. వైరస్ ఉన్న విషయం వారికి తెలియదు, వారిని ఇబ్బంది పెట్టదు. కానీ ఇతరులకు మాత్రం వ్యాపిస్తుంది. ఇక బాగా సూక్ష్మ బిందువులలో చేరిన వైరస్ గాలిలో తేలుతూ మన వరకూ రావచ్చు.

 
ఇంట్లో మాస్క్ ధరించడానికి శాస్త్రీయత ?
''ఇది శాస్త్రీయం కాదు కానీ, జాగ్రత్తలో ఒక భాగం '' అన్నారు డాక్టర్ హిమాన్షు. వైరస్ విషయంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల ఇది శాస్త్రీయం అని నిరూపించడం కష్టం.'' అన్నారాయన.

 
ఇంట్లో రక్షణగా మాస్క్ కాకుండా మరో మార్గం ఉందా?
ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరు లక్షణాలు కనిపించినా వాటిని తేలికగా తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇప్పుడు చాలామంది వైద్యులు ఫోన్‌ల ద్వారా కూడా వైద్య సలహాలు ఇస్తున్నారు'' అన్నారు డాక్టర్ హిమాన్షు.