సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (10:00 IST)

కోవిడ్: వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది?

కోవిడ్ వ్యాక్సీన్ చుట్టూ అనేక అపోహలు అలముకున్నాయి. వ్యాక్సీన్ తీసుకోవాలా వద్దా అని చాలామంది సంశయిస్తుండగా.. మొదటి డోస్ తీసుకున్న తరువాత రెండో డోస్ తీసుకోకపోతే ఏమవుతుందన్న భయాన్నీ చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

 
తమిళ నటుడు వివేక్ మరణం తరువాత, కోవిడ్ వ్యాక్సీన్ మొదటి డోసు తీసుకున్నవాళ్లు కూడా రెండో డోసు తీసుకోవడానికి భయపడుతున్నారు. మొదటి డోసు తీసుకున్న తరువాత కూడా వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్టుల గురించి భయమేస్తోందని కొందరు అంటున్నారు. వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోవడం అవసరమా? తీసుకోకపోతే ఏమవుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.

 
దీనిపై నిపుణులు ఏమంటున్నారో చదవండి..
కోవిడ్ వ్యాక్సీన్ రెండో డోసు తీసుకోకపోతే ఏమీ కాదని, దాని వలన ఆరోగ్య సమస్యలేవీ తలెత్తవని తమిళనాడు పబ్లిక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ కుళందైసామి స్పష్టం చేశారు. "ఎవరికైనా ఒక నిర్దిష్టమైన మందు వల్ల అలర్జీలు వస్తాయనుకుంటే అది మొదటి డోసు వేసుకోగానే తెలిసిపోతుంది. మొదటి డోసు వేసుకున్నాక ఏ సైడ్ ఎఫెక్టులు లేకపోతే రెండో డోసుకు కూడా ఏమీ ఉండవు.

 
రెండో డోసు రోగ నిరోధక శక్తి మరింత పెరిగేందుకు దోహదపడుతుంది. మొదటి డోసుతోనే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. రెండో డోసు తీసుకోకపోయినా ఏం ఫరవాలేదు. కానీ, తీసుకుంటే మంచిది. కోవిడ్‌తో పోరాడేందుకు రెండో డోసు మరింత ఉపయోగపడుతుంది" అని డాక్టర్ కుళందైసామి చెప్పారు.

 
ఇండియాలో తయారైన కోవిడ్ వ్యాక్సీన్ ఇండియన్ వేరియంట్‌పై మాత్రమే ప్రభావవంతంగా పని చేస్తుందా? లేక ఫారిన్ వేరియంట్లపై కూడా పని చేస్తుందా? అని కొందరు సందేహాలు వెలిబుచ్చారు. "చాలామందికి ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఇండియాలో రెండు వ్యాక్సీన్లు తయారవుతున్నాయి. ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాగ్జిన్. రెండు వ్యాక్సీన్లు కూడా అన్ని రకాల కరోనావైరస్ వేరియంట్లపై ప్రభావవంతంగా పని చేస్తున్నాయని కోవిడ్ సెకండ్ వేవ్‌లో తేలింది.

 
ఇండియన్ వేరియంట్ మాత్రమే కాక ఫారిన్ వేరియంట్లను ఢీకొనడంలో కూడా మన వ్యాక్సీన్లు సఫలమవుతున్నాయి" అని కుళందైసామి వివరించారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా కోవిడ్ వ్యాక్సీన్ విషయంలో తలెత్తుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం లేదని డాక్టర్ పుగళేంది అభిప్రాయపడ్డారు. "నటుడు వివేక్ మరణం తరువాత చాలామందికి అనేక రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. అది సహజం. వ్యాక్సీన్ వేసుకోవాలో వద్దో అనేది వ్యక్తిగత నిర్ణయం అని కేంద్ర తేల్చి చెప్పింది.

 
వ్యాక్సీన్ వల్ల కలిగే నష్టాలకు కేంద్రంగానీ, మెడికల్ కంపెనీలుగానీ బాధ్యత వహించవని, ఎలాంటి పరిహారాలు చెల్లించవని కూడా తేల్చి చెప్పారు. అయితే, కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకున్న తరువాత కరోనా సోకదని చెప్పలేం. అలాంటప్పుడు ప్రజలు ఎలా ధైర్యంగా వ్యాక్సీన్ వేసుకోగలరు?" అని డాక్టర్ పుగళేంది ప్రశ్నిస్తున్నారు.

 
"వ్యాక్సినేషన్ వలన సంభవించిన 600 మరణాలలో 15 మరణాలపై ప్రభుత్వం పరిశోధన జరిపింది. ఈ మరణాలు కోవిడ్ వ్యాక్సీన్ వల్ల సంభవించినవి కాకపోవచ్చని వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్టులను పరిశీలిస్తున్న ప్రభుత్వ బృందం సందేహం వ్యక్తం చేసింది. అయితే, ఈ మరణాలకు కారణాలేంటో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. వివేక్ మరణానికి కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, వివేక కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఆ ప్రయత్నాలను విరమించుకుంది. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో అవిశ్వాసాన్ని సృష్టిస్తాయి" అని ఆయన అన్నారు.

 
"వ్యాక్సీన్ పట్ల ప్రజల్లో కలిగే సందేహాలను నివృత్తి చేయడం ఒక పెద్ద సవాలు. అయితే అనుమానాలు రావడం అనేది సహజం" అని ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ మారియప్పన్ అన్నారు.