సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (16:09 IST)

పాఠశాలల్లో కొవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్ల‌ ఏర్పాటు: సీఎం జ‌గ‌న్

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే, ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని.. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగించాలన్నారు. పాఠశాలలు తెరిచినందున అక్కడ కొవిడ్‌ నిబంధనలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

పాఠశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని.. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించేలా చూడాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఖాళీలను 90 రోజుల్లో భర్తీ చేయాలన్నారు. ఎక్కడా సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని.. వైద్య సేవలు అందడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమర్థమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం రెండు కొత్త వెబ్‌సైట్లు తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.