శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (12:11 IST)

ఇండియా టు డే సర్వే.. బెస్ట్ సీఎంగా యోగి - టాప్-10లో కనిపించని తెలుగు సీఎంలు

ప్రముఖ వారపత్రిక ‘ఇండియా టుడే’ తాజాగా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. జాతీయ స్థాయి జరిగిన ఈ సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రిగా 19 శాతం ఓట్లతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ మొదటి స్థానంలో నిలిచారు. 
 
అయితే, గతేడాదితో పోలిస్తే ఆయన ఆదరణ 6 శాతం తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 11 శాతం ప్రజాదరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు.
 
ఇకపోతే, గతేడాది నిర్వహించిన ఇదే సర్వేలో ‘బెస్ట్ సీఎం’గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ ఈసారి పడిపోయింది. బోల్డన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆయనకు సరైన ఆదరణ లభించకపోవడం గమనార్హం. 
 
ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను స్వరాష్ట్ర ప్రజలు బెస్ట్ సీఎం అంటూ కీర్తించారు. ఆ రాష్ట్రంలో 42 శాతం మంది ఆయనకు ఓట్లేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. అలాగే స్వరాష్ట్రంలో ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (38శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (35శాతం) రెండు మూడు స్థానాల్లో నిలిచారు.
 
‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ టాప్-10 జాబితాలో కూడా ఏపీ సీఎం జగన్ పేరు కనిపించలేదు. టాప్-10 జాబితాను మాత్రమే వెల్లడించడంతో జగన్ స్థానం ఎంతన్నది తెలియరాలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా టాప్ టెన్ జాబితాలో కనిపించక పోవడం గమనార్హం.