సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (13:59 IST)

కరోనా థర్డ్ వేవ్ ముంగిట భారత్ : హెచ్చరించిన యూబీఎస్ సెక్యూరిటీస్

భారత్‌కు కరోనా మూడో దశ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇపుడు తాజాగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ కూడా మూడో ముప్పు తప్పదని హెచ్చరించింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ వ్యాప్తి, క‌రోనా వైర‌స్ మ్యుటేష‌న్ల‌తో థర్డ్ వేవ్ వస్తుందని తెలిపింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మంద‌కొడిగా సాగుతుండ‌టం గ్రామీణ ప్రాంతాల నుంచి వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండంట‌తో మూడో ముప్పు ఆందోళ‌న రేకెత్తిస్తోంద‌ని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థిక‌వేత్త త‌న్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు.
 
దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ క్రమంలోనే థ‌ర్డ్ వేవ్ ముప్పు వెంటాడుతోంద‌ని, డెల్టా వేరియంట్ కేసుల పెరుగుద‌ల‌, వైర‌స్ మ్యుటేష‌న్లు థ‌ర్డ్ వేవ్ ముప్పుకు సంకేతాలన్నారు.
 
మరోవైపు దేశంలో రోజూవారీ న‌మోద‌వుతున్న తాజా కేసులను చూస్తే మూడో ముప్పు క్ర‌మంగా ఎదుర‌వ‌నుంద‌ని వెల్ల‌డ‌వుతోంద‌ని నివేదిక అంచ‌నా వేసింది. ఇక వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మంద‌కొడిగా సాగుతుండ‌టం కూడా ఆందోళ‌న రేకెత్తిస్తోంద‌ని పేర్కొంది. 
 
జూన్‌లో రోజుకు స‌గ‌టున 40 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు వేయ‌గా జులై 12న ఇది 34 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింద‌ని, వ్యాక్సిన్ల కొర‌త వెంటాడ‌టం వైర‌స్ కేసుల పెరుగుద‌ల‌కు దారితీస్తుంద‌ని నివేదిక తెలిపింది. 
 
18 ఏళ్లు పైబ‌డిన వారిలో కేవ‌లం 22.7 శాతం మంది తొలిడోసు తీసుకోగా కేవ‌లం 5.4 శాతం జ‌నాభానే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంద‌ని యూబీఎస్ సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడైంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
మరోవైపు, కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా, కరోనా డెల్ట్ వేరియంట్ ముప్పు ఇంకా పొంచివుందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వీక్లీ నివేదికలో హెచ్చరించింది.
 
ఈ వేరియంట్‌తో ముడిపడిన కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది
 
అలాగే, ఆల్ఫా వేరియంట్ 178 దేశాల్లోనూ, బీటా రకం 123, గామా వేరియంట్ 75 దేశాల్లోనూ ఉనికిలో ఉన్నట్టు వివరించింది. ఆందోళన రకం వైరస్‌లలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వివరించింది. తక్కువ సంఖ్యలోనూ వ్యాక్సిన్లు పూర్తి కావడంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. 
 
ఇప్పటి వరకు ప్రపంచంలోని నాలుగోవంతు జనాభాకు మాత్రమే తొలి విడత వ్యాక్సిన్ అందిందని, ఈ విషయంలో సంపన్న దేశాలే ఎక్కువ టీకాలు అందుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వివరించింది.