సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (09:21 IST)

మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ : ఏపీ - తమిళనాడులకు భారీ వర్ష సూచన

cyclone
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాతీర జిల్లాలతో ఉత్తర తమిళనాడు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫానుకు మిచౌంగ్‍గా నామకరణం చేశారు. ఇది ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదని వాతావరణ శాఖ పేర్కొంది.
 
ఈ నెల 3-5 తేదీల మధ్య దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం మరింతగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుఫాను భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 
 
డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీ మీటర్ల వరకూ వర్షపాతం నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.