శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (09:58 IST)

కరోనా పరీక్షా ఫలితాల్లో ఆలస్యం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోంది: చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హెల్త్ స్పెషలిస్ట్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ భేటిలో వైద్య, ఆరోగ్య నిపుణులు, పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ కరోనా వైరస్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావం, ప్రజలను అప్రమత్తం చేసేందుకే ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం. ఇది ప్రజాహితం కోసం సమావేశం, ఇక్కడ రాజకీయాలు లేవు, సామాజిక బాధ్యతతో సమాజ హితం కోసం పెట్టిన సమావేశం. ఈ భేటిలో మీరిచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వానికి పంపిస్తాం.
 
కరోనా ముందు జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నాం. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ (జిఎఫ్ ఎస్ టి) ద్వారా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపుతున్నాం. వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేయడమే పరిష్కార మార్గం. అందరిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దీనిపై భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉంది.

కోవిడ్ పాజటివ్ కేసుల సంఖ్యలో మనదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే 13,39,130 కేసులు నమోదు అయ్యాయి, మొత్తం 31,425మంది చనిపోయారు. గత 2వారాల్లో 4,88,769కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో రోజువారీ వృద్ది 4.10% ఉంది. గత 2వారాల్లో 8,470మంది మృతిచెందారు. దేశంలో రోజువారీ మరణాల రేటు 2.75% ఉంది. రికవరీ రేటు 60% ఉంది. 8,50,303మంది రికవరీ అయ్యారు. 

కేసుల సంఖ్యలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 5వస్థానంలో ఉంది. మొత్తం 80,858 కేసులు నమోదు అయ్యాయి. ప్రతి 10సెకన్లకు ఒక కొత్త కేసు వస్తోంది. రాష్ట్రంలో కేసుల వృద్ది రేటు 14.06% ఉంది. మొత్తం 933మంది చనిపోయారు, మరణాల్లో ఏపి 2వ స్థానంలో ఉంది, రికవరీలో చాలా తక్కువగా ఉంది. 

గత 2వారాల్లో 53,623 కొత్త కేసులతో రోజువారీ కేసుల వృద్దిరేటు ఏపిలో 14.06% ఉంది, దేశంలోనే ఇది అత్యధికం. నిన్న ఒక్కరోజే ఏపిలో 8,150పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 2వారాల్లో624మంది చనిపోయారు, రోజువారీ మరణాల రేటు 14.42% ఉంది,దేశంలోనే ఇది అత్యధికం. 

రాష్ట్రంలో రికవరీ రేటు దేశంలోనే అతి తక్కువ ఉండటం ఆందోళన కరం. ఇప్పటిదాకా 39,935మంది మాత్రమే రికవర్ అయ్యారు, దేశంలో రికవరీ రేటు 60% ఉంటే మనరాష్ట్రంలో  49.3% మాత్రమే ఉండటం గమనార్హం. అందుకే ‘‘టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్’’ అని పదేపదే చెబుతూ వచ్చాం. 
 
వైరస్ టెస్టింగ్ లకు రాష్ట్రంలో 18ఆర్ టిపిసిఆర్ ల్యాబ్ లు సరిపోవడం లేదు. కరోనా చికిత్సలో స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనుసరించాలి, శానిటైజేషన్ చేయాల్సివుంది. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటించాలి, డిజిటల్ సోషలైజేషన్ అనుసరించాలి. వర్ట్యువల్ వర్కింగ్ ను ప్రోత్సహించాలి.పోషకాహారంతో రెసిస్టెన్స్ పెరుగుతుంది. యోగాభ్యాసం వల్ల శ్వాస కోశ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

ప్రజల్లో కోవిడ్ వైరస్ పట్ల అవగాహన పెరగాల్సివుంది. ప్రస్తుత సంక్షోభంలో కీలక భూమిక ప్రభుత్వానిదే. రాష్ట్రంలో హెల్త్ అండ్ వెల్ నెస్ క్యాంపైన్ మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఫ్రంట్ లైన్ వారియర్ల త్యాగాలు వెలకట్టలేనివి. కరోనా బాధితులకు సేవలు అందిస్తూ డాక్టర్లు, నర్సులు, పోలీసులు,పారిశుద్య కార్మికులు అనేకమంది చనిపోయారు.

అప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడీ కరోనాపై పోరాటంలో ప్రాణాలు ఫణంగా పెట్టి  ఫ్రంట్ లైన్ వారియర్లు పోరాడుతున్నారు. చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లను ప్రభుత్వాలే ఆదుకోవాలి. మృతుల కుటుంబ సభ్యులకు కొన్ని రాష్ట్రాలలో ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు.
 
రాబోయే ఆగస్ట్ 15న ఫ్రంట్ లైన్ వారియర్లకు నివాళులు అర్పించాలని ప్రధాని నరేంద్రమోడి ఇప్పటికే పిలుపిచ్చారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంపొందాలి. ఈ పోరాటంలో ఫస్ట్ లైన్ వారియర్లు నర్సులే, వారిని అందరూ గౌరవించాలి, వారి త్యాగాలను సమాజం మరిచిపోరాదు.

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ కరోనాపై పోరాటంలో నర్సులు, ఏఎన్ ఎంలు, ఆశావర్కర్లు ముందున్నారు. డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు.. ఫ్రంట్ లైన్ వారియర్లుగా పోరాడుతున్నారు. వారి సేవలు మరువలేనివి. 

వ్యాక్సిన్ వచ్చేదాకా ప్రజలను చైతన్యపర్చడమే ఏకైక మార్గం. కరోనాపై అవగాహన పెంచాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.కరోనాను నిర్లక్ష్యం చేసినా, తేలిగ్గా తీసుకున్నా, దాచిపెట్టినా ప్రమాదం ముంచుకొస్తుంది. మనమే సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని మింగేస్తుంది. 

కరోనా వల్ల సమాజానికి కలిగే కీడును విశ్లేషించాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
ఇదొక సామాజిక రుగ్మతగా మారే ప్రమాదం ఉంది. కుటుంబ సంబంధాలు క్షీణించే దుస్థితి వచ్చింది. భర్తకు కరోనా వచ్చిందని ఏఎన్ ఎంను ఇంట్లోకి రానివ్వని పరిస్థితి చూశాం. 

ఏ రోజు ఎలాంటి చెడువార్త వినాల్సివస్తుందో అని భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏ ఫోన్ ఎవరినుంచి వస్తుందో అనే భయం వెన్నాడుతోంది. టెస్టింగ్  రిజల్ట్స్ లో జాప్యం వల్ల, సకాలంలో ఆసుపత్రిలో చేర్చుకోక పోవడం వల్ల, చెట్ల కింద రోగులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి, అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడే మరణించడం, రోడ్లపైనే మృతదేహాలు చూస్తుంటే బాధేస్తోంది. 
 
మరణించాక కుటుంబ సభ్యులే దగ్గరకు రానివ్వని దుస్థితి. మృతదేహాలను జెసిబిలతో తీసుకెళ్లడం బాధాకరం. టెస్టింగు రిపోర్టులు వచ్చేదాకా చికిత్స అందించక పోవడం వల్ల ఇతర రోగులు సకాలంలో సరైన వైద్యం అందక మృతిచెందుతున్నారు. టెస్టింగ్ రిజల్ట్స్ త్వరితగతిన వచ్చేలా చూడాలి. వారం పది రోజులు పరీక్షా ఫలితాల కోసం వేచిచూసే పరిస్థితి ఉండరాదు. దానివల్ల మానసిక భయాందోళనలు పెరగడం, సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. 
 
అంబులెన్స్ లలో అత్యధిక రోగులను ఎక్కించడం వల్ల అనేక దుష్ఫలితాలు.. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు లేనందున ఇళ్లలోనే ఉంటున్నారు, ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగుల పాలిట కరోనా ప్రాణాంతకంగా మారింది. భయంతో, గుండెపోటుతో మరణిస్తున్నారు. వెంటిలేటర్ల అందుబాటు పెంచాలి. 
 
ఎక్కడికక్కడ వైరస్ విస్తరించకుండా చూడాలి. ఏం చేయాలో(డూస్) , ఏం చేయకూడదో (డునాట్స్) తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా చూడాలి. క్వారంటైన్ కేంద్రాల్లో కూడా అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టడం, సకాలంలో సరైన చికిత్స అందించడం, వసతులు- సౌకర్యాలు పెంచాలి. నాణ్యమైన ఆహారం ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుత సంక్షోభంలో కోవిడ్ వైరస్ కట్టడిని ఒక సవాల్ గా తీసుకోవాలి.

కరోనాపై యుద్దంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలి. తోటివారిలో అవగాహన పెంచేందుకు, చైతన్యపరిచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా  మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం. రాష్ట్రంలో ఉన్న ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. 
 
సమాజంలో బాధ్యత గలిగిన వ్యక్తులుగా మన విజ్ఞానాన్ని సమాజాభివృద్దికి దోహదపడేలా చూడాలి.  ప్రజలకే కాదు, ప్రభుత్వానికి కూడా సమాజం పట్ల బాధ్యత ఉంది. ప్రజలను చైతన్య పర్చడం మనందరి సామాజిక బాధ్యతగా గుర్తుంచుకోవాలి. మనం అందరం మన వంతు బాధ్యతలు నిర్వర్తిద్దాం. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ప్రజలను ఆదుకునే బృహత్కార్యంలో భాగస్వాములు అవుదాం. మనకోసం, మన కెరీర్ కోసం పని చేయడమే కాకుండా, సమాజం కోసం పనిచేద్దామని’’ చంద్రబాబు పిలుపునిచ్చారు.