బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 జనవరి 2021 (18:56 IST)

ఫిబ్రవరి ఒకటో తేది నుంచి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి ఒకటో తేది నుంచి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు, సరుకుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నెల్లూరు కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

నెల్లూరు కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం రుణ ఖాతాలు పుర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సరుకులు పంపిణీ చేసే ప్రతి వాహనానికి విధిగా జిపిఎస్‌ అనుసంధానం చేయాలన్నారు.

వాహన రిజిస్ట్రేషన్‌ లతో సహా ఇన్సూరెన్స్‌ లను త్వరితగతిన పూర్తి చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రతి లబ్ధిదారులకు ఏ ఏ రేషన్‌ షాపుల నుంచి తీసుకొని వెళ్ళ వలసినది ముందుగానే సూచించాలన్నారు. అంతేకాకుండా ప్రతి డ్రైవర్‌ ను ప్రత్యక్షంగా పరిశీలించి వాహనాన్ని సరిగా నడుపుతున్నది లేనిది అధికారులు పర్యవేక్షించాలి అన్నారు.

రుణ ఖాతాలకు సంబందించి ఏమైనా సమస్యలుంటే వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఇంకనూ జిల్లాకు రావాల్సిన 193 వాహనాలను త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. వాహనాలను తనిఖీ చేయడం పూర్తి అయినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈనెల 20వ తేదీ లోపల అవసరమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు హరేందిర ప్రసాద్‌, ప్రభాకర రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి బాలకష్ణ పాల్గొన్నారు.