శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (12:15 IST)

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి...

dharmana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (భూ హక్కు చట్టం)పై రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాద రావు ద్వంద్వం వైఖరితో మాట్లాడుతున్నారు. ఈ చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో వైకాపా నేతలు ఈ అంశంపై స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి వారిలో మంత్రి ధర్మాన ప్రసాద రావు ఒకరు. మాటల గారడీలో ఆరితేరిన ధర్మాన 'భూహక్కు చట్టం' అమలుపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తోందని గతంలో ప్రగల్భాలు పలికారు. చట్టంలో పొందుపరిచిన అంశాలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పాపం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదేనంటూ ప్రస్తుతం ప్లేటు ఫిరాయించారు.
 
గత ఫిబ్రవరి 3వ తేదీన ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తేదీన శ్రీకాకుళంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ... ‘కేంద్ర ప్రభుత్వ సిఫార్సులు, నీతిఆయోగ్‌ సూచనల మేరకు ప్రజల కోసం భూహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాం. దీని కోసం ముందుస్తుగా రీసర్వే ప్రక్రియ పూర్తికావాలి. అభ్యంతరాలు కోరుతూ త్వరలో ఒక వెబ్‌సైట్‌ ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు.
 
అయితే, ఈ నెల 29వ తేదీ సోమవారం శ్రీకాకుళంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో మంత్రి ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ ‘భూ హక్కు చట్టం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిది. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది. అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. ఇప్పుడు ఆ చట్టంపై ఆ పార్టీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై స్పష్టత రావాలి. అప్పటివరకు ఈ చట్టం అమలు చేయబోమని గతంలోనే స్పష్టం చేశాం. ప్రతిపక్షాలు ఓ మెమో పట్టుకుని ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. జగన్‌ భూములు లాగేసుకుంటాడు.. ప్రజలారా మీరంతా జాగ్రత్త పడండి అని అతి తెలివి కలిగిన వారు చెప్పడం.. న్యాయవాదులమని పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడటం.. సమాజాన్ని తప్పుదోవ పట్టించడం.. ఇదేనా చైతన్యవంతులు చేయాల్సిన పని?’ అని వ్యాఖ్యానించారు.