రఘువీరన్న వచ్చేయండి, ఆ నేతకు స్వయంగా సిఎం ఫోన్, ఏమన్నారంటే?
తన స్వగ్రామంలో ఆలయ పనులు చేసుకుంటూ పొలం పనుల్లో బిజీగా ఉంటూ మీడియాకు కనిపించకుండా తిరుగుతున్న మాజీ ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి కీలక నేతగా ఉన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేతగాను, ఎమ్మెల్యేగాను, మంత్రిగాను పనిచేసిన అనుభవం ఆయనది. అలాంటి వ్యక్తి కొన్నిసంవత్సరాల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. అసలు రాజకీయాలే వద్దనుకుని సైలెంట్‌గా ఉన్నారు. వైఎస్ఆర్ ఉన్న సమయంలో జగన్‌తోను అత్యంత సన్నిహితంగా ఉన్నారు రఘువీరా.
వారిద్దరి మధ్య స్నేహబంధం అప్పటి నుంచే ఉంది. అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామంలో ఆలయ అభివృద్థి పనుల కోసం రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా ఆ పనులు పూర్తి కావడంతో ఇక మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకున్నారట. విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా రఘువీరాకు ఫోన్ చేశారట.
రఘువీరన్న మీరు వచ్చేయండి.. మనం కలిసి పనిచేద్దాం. మీకు పదవులు వద్దనుకున్నా ఫర్వాలేదు. నామినేటెడ్ పోస్టు కావాలనుకున్నా ఒకే. మీ ఇష్టం. మీరు తిరిగి మన దగ్గరకు రావాలి అని జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారట. ఇప్పుడిదే వైసిపిలో హాట్ టాపిక్‌గా మారుతోంది. గతంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి వైసిపిలోకి వలస వచ్చేశారు.
మంత్రులుగా ప్రస్తుతం ఉన్నారు కూడా. రఘువీరా వస్తే వైసిపిలో ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. రఘువీరా వైసిపిలో చేరే అవకాశం లేదని మరికొంతమంది వైసిపి నేతలు బలంగా చెబుతుంటే, చేరినా పెద్దగా ఉపయోగం ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ రఘువీరా మాత్రం తన అనుచరులను కనుక్కుని ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్ళాలా లేదా అన్న నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.