మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:27 IST)

ఏపీలో అక్టోబర్ 2 న గిరిజనులకు భూ పట్టాల పంపిణీ

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈనెల 9 న జరిగే వేడుకలలో గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు, భూ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆగష్టు 9 కి బదులుగా అక్టోబర్ 2 న పట్టాలను ఇస్తామని చెప్పారు. అయితే ఆదివాసీ దినోత్సవ వేడుకలు మాత్రం అన్ని ఐటిడిఏలలో జరుగుతాయని స్పష్టం చేశారు.

ఆదివారం నాడు రాష్ట్ర స్థాయిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా రాష్ట్ర స్థాయి లో నిర్వహించాల్సిన వేడుకను వాయిదా వేశామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు.

అయితే రాష్ట్రంలోని అన్ని ఐటిడిఏలలో ఆగస్టు 9 న ఎక్కడికక్కడ ఈ వేడుకలను నిర్వహించాల్సిందిగా ఐటిడిఏ పీవోలకు ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. ఐటిడిఏలలో జరిగే ఈ వేడుకలలో జిల్లా అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధులు హాజరు అవుతారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విజయనగరంలో జరిగే ఆదివాసీ దినోత్సవ కార్య్రమానికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హాజరు అవుతారని వివరించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పథకంలో భాగంగా అటవీ హక్కు పత్రాలు, ప్రభుత్వ భూములకు సంబంధించిన డికేటి పట్టాలను కూడా ఇవ్వాల్సి ఉందన్నారు.

అయితే కరోనా నేపథ్యంలో ఈ పట్టాల పంపిణీ వాయిదా వేశామని, అక్టోబర్ 2 న వాటిని గిరిజనులకు అందిస్తామని  అధికారులు విపులీకరించారు. ఆరోజున మరింత ఎక్కువ మందికి పట్టాలను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.