బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 మే 2020 (19:56 IST)

రెండు విడతలుగా పోషకాహార పంపిణీ : డాక్టర్ కృతికా శుక్లా

అంగన్ ‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార కార్యక్రమాన్ని మే నెలలో రెండు విడతలుగా అందించటం జరగుతుందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నిరంతర పొడిగింపు నేపధ్యంలో ప్రభుత్వ అదేశాల మేరకు 6 నుండి 36 నెలలు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఆరవతేదీ లోపు ఒక విడత, మే 17,18 తేదీలలో రెండవ విడత రేషన్ పంపిణీ చేయనున్నామన్నారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చిన్నారులు, గర్బీణీలు, బాలింతలు ఎటువంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యచరణతో ముందుకు సాగుతుందన్నారు.

కరోనా నేపధ్యంలో అంగన్ వాడీ కార్యకర్త రేషన్ ఇచ్చే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసి ఉండగా, సబ్బులు, శానిటైజర్లు కొనుక్కోడానికి ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిధులను ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు.

ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని పంపిణీ చేయాలని ఆదేశించామని, ఎటువంటి అవకతవకలకు అస్కారం లేకుండా వలస కుటుంబాలలోని లబ్ధిదారులకు అందించిన రేషన్ వివరాలను సైతం రికార్డు చేయవలసి ఉంటుందన్నారు.

లాక్‌డౌన్ సమయంలో అందించిన సేవలపై లాక్ డౌన్ ఎత్తివేసిన తదుపరి సోషల్ అడిట్ నిర్వహిస్తామని ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని డాక్డర్ కృతికా శుక్లా హెచ్చరించారు.

ఇంటివద్దనే రేషన్ తీసుకున్న లబ్ధిదారుల హాజరును సిఎఎస్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేసేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సీ.డీ.పీ.ఓ. లు తగు చర్యలు తీసుకోవాలని,  టేక్ హోమ్ రేషన్ ఎన్ని రోజులకి ఇచ్చారో అన్ని రోజుల హాజరును ప్రతీ లభ్డిదారుని సిఎఎస్ లో నమోదు చేసేలా స్పష్టపరిచామన్నారు.

అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం అంతా జిల్లా పరిపాలన అధికారి పర్యవేక్షణలో జరగవలసి ఉండగా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు వారితో సమన్వయం చేసుకొని అంగన్ వాడీ కేంద్రాలకు నిర్దేశించిన సరుకులు, గుడ్లు, పాలు తాజావి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. 

లబ్దిదారులు పోషకాహార వినియోగంలో ఎటువంటి అంతరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల్లో అయా ప్రాంతాలను గ్రీన్/ఆరెంజ్/రెడ్ జోన్లుగా గుర్తించడం వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా పరిపాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవలసి ఉంటుందని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

సోమవారం నుండి మే 31 వరకు 23 రోజులకు గాను రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 6-36 ,  36-72 నెలల పిల్లలు, గర్భిణీ, బాలింతలకు బియ్యం, కందిపప్పు, నూనె ఒకే సారి అందచేస్తారని, తాజా కోడిగుడ్లు, పాలు మాత్రం రెండు దఫాలుగా ఇవ్వనున్నారని వివరించారు.

సాధారణ అనుబంధ పోషకాహారం కార్యక్రమం క్రింద గర్బిణీ, బాలింతలకు బియ్యం 3 కిలోలు, కందిపప్పు కిలో, నూనే అరకిలో, గుడ్లు 11, రెండు లీటర్ల పాలు మొదటి విడతగా, 12 గుడ్లు, రెండు లీటర్ల పాలు రెండో విడతగా అందచేస్తారని పేర్కొన్నారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు బియ్యం రెండు కిలోలు, కందిపప్పు అరకిలో, నూనె 250 గ్రాములు, 11 గుడ్డుల మొదటి విడతలో, 12 గుడ్లు రెండో విడతలో అందిస్తారని సంచాలకులు పేర్కొన్నారు.

6-36 నెలల పిల్లలకు మొదటి విడతలో 2.5 కిలోల బాలామృతం, ఎనిమిది గుడ్లు అందించనుండగా, మరోవైపు బాల సంజీవని కార్యక్రమం క్రింద తొలి విడతలో మూడు గుడ్లు, లీటరు పాలు, తుది విడతలో 12 గుడ్లు, లీటరు పాలు పంపిణీ చేయనున్నారు. అదే క్రమంలో బాల సంజీవని కార్యక్రమం క్రింద మూడు నుండి ఆరేళ్ల చిన్నారులకు తొలి విడతలో లీటరు, మలి విడతలో మరో లీటరు పాలు అందిస్తారు.

వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా 77 మండలాలలో ఆరు నుండి 36 నెలల పిల్లలకు తొలి విడతగా 14 గుడ్లు, 3 లీటర్ల పాలు, మలి విడతలో 14 గుడ్లు, 3.6 లీటర్ల పాలు అందించనున్నారని డాక్డర్ కృతికా శుక్లా తెలిపారు. ఇదే పధకం కింద మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు తొలి విడత రెండు, మలి విడతలో 2.6 లీటర్ల పాలు పంపిణీ చేస్తారు.

వైఎస్ఆర్  సంపూర్ణ పోషణ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలకు  ఇవ్వాల్సిన అదనపు పోషకాహారం వారానికొకసారి అందించాలని ఆదేశించామని, బాల సంజీవని కార్యక్రమం క్రింద  రక్తహీనత/హై రిస్క్ గర్భిణీ, బాలింతలకు అందరికీ అందిస్తారన్నారు.

కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా టేక్ హోమ్ రేషన్ పంపిణీ మహిళా సంరక్షణ కార్యదర్శి, ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్ పర్యవేక్షణలో అంగన్ వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందిస్తూ  కనీసం 6 అడుగుల దూరం తప్పకుండా పాటించాలని సూచించామన్నారు.