గుంటూరులో దారుణం.. వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల పంపిణీ

oil packet
ఎం| Last Updated: శనివారం, 24 ఆగస్టు 2019 (19:08 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను మరింత క్షోభకు గురిచేసేలా అధికారులు వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనెను అందించారు.

ఈ నూనె ప్యాకెట్ల కాలపరిమితి గత నెలతో ముగిసినప్పటికీ అధికారులు ఆ ప్యాకెట్లను వరద బాధితులకు అంటగట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ..‘వరద వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు వచ్చి సామగ్రి అందించారు. అందులోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఇచ్చారు. ఇలాంటి చర్యలతో మా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

కాగా, ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కి తీసుకెళ్లినట్లు సమాచారం.
దీనిపై మరింత చదవండి :