శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (19:03 IST)

కోడెల తీరుతో పార్టీకి నష్టం.. టీడీపీ నేత వర్ల రామయ్య

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన చర్యలతో పార్టీ పరువును రోడ్డు న పడేశారని సాక్షాత్తు ఆ పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మండి పడ్డారు.. కోడెల శివప్రసాద్ చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని బహిరంగంగా వెల్లడించారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన వర్ల  ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోవడం అన్నది ముమ్మాటికీ తప్పేనని స్పష్టం చేశారు. ఆయన తీరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నాకు తెలిసినంతవరకూ కోడెల చేసింది తప్పే. ఆయనకు ఫర్నీచర్ కు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇంటికి ఫర్నీచర్ ను ఎలా తీసుకెళతారండీ? ఈ విషయం బయటకు వచ్చాక ‘ఇప్పుడు కావాలంటే తీసుకెళ్లండి’ అని కోడెల చెప్పడం కరెక్ట్ కాదు. కోడెల అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది.

అసెంబ్లీ సిబ్బంది తీసుకెళ్లలేదు కాబట్టి సామగ్రిని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పడం కూడా తప్పే.  ఆయన అసెంబ్లీ కార్యదర్శికి చెప్పే తీసుకెళ్లారా ఫర్నీచర్ ను? లిస్ట్ ఇచ్చారా? అంటూ కోడెలపై ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ స్పీకర్  కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని వ్యాఖ్యానించారు.