సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (19:28 IST)

కోడెల దొరికిన దొంగ... చంద్రబాబు దొరకని దొంగ: వైసీపీ నేత అంబటి రాంబాబు

కోడెల దొరికిన దొంగ... చంద్రబాబు దొరకని దొంగ అని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...

"అర్జున్‌ అనే వ్యక్తి మున్సిపాలిటిలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. మా కార్యాలయం ఉద్యోగి కానేకాదు.  అతను లెటర్‌ లు బాగా రాస్తాడని తెలిసి మా కార్యాలయంలోని ఉద్యోగికి సలహాలు ఇచ్చి వెళ్లిపోయాడు. వాస్తవం ఇలా ఉంటే ఈ రోజు కోడెల ఆయన ఇంట్లో కంప్యూటర్లు దొంగతనం చేయడానికి పంపానని ఆరోపణ చేశారు. ఆ కంప్యూటర్లు దొంగతనం చేయడానికి మాకు ఏం కర్మ పట్టింది.

కోడెల ఇంట్లో దొంగతనం అని స్క్రోలింగ్స్‌ చూశాను. అలా కాదు రావాల్సింది. గజదొంగ ఇంట్లో దొంగతనం అని రావాల్సిఉంది. కోడెల ఇంట్లో నిజంగా దొంగతనం జరిగి ఉంటే పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు జరిగిన చిన్న దొంగతనం అని చెబుతాను. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ వాళ్లు సత్తెనపల్లిలో కంప్యూటర్‌ శిక్షణకోసం కంప్యూర్లు తెచ్చిపెట్టారు.

గజదొంగల ముఠాలోని కోడెల కుమారుడు, కుమార్తె 30 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వాటిని కాలేజిలకు ఇచ్చారో,అమ్ముకున్నారో తెలియదు. ఈ ప్రచారం నా వద్దకు కూడా చేరింది. దాంతో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ఎండికి ఈ వ్యవహారంపై విచారణ చేసి నాకు తెలియచేయాలని లెటర్‌ రాశాను. ఎండి గుంటూరు జిల్లా హెడ్‌ కు విచారణకు ఆదేశించారు.

డిఎస్సి కోఆర్డినేటర్‌ ను ఆదేశిస్తే వారు విచారణకు ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ఎండి అక్కడకు వచ్చి కంప్యూటర్లకోసం చూస్తే అవిలేవు. ఈ విషయం ఆ దొంగలముఠాకు తెలిసిన తర్వాత రాత్రికి రాత్రి 29 కంప్యూటర్లు ప్రత్యక్షమయ్యాయి.

కంప్యూటర్లు దొరికాయి కాబట్టి కేసు కంప్లీట్‌ చేయాలని కోడెల ఉద్దేశ్యం. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోడెల ఇంట్లో దొంగతనాన్ని క్రియేట్‌ చేసినట్లు కనిపిస్తోంది. కంప్యూటర్‌ స్కామ్‌ బయటకు వస్తుందని తెలిసి కోడెల దీనిని రచించారని అనిపిస్తోంది. దీనిలో నాకేం సంబంధం? కోడెల దొరికిపోయిన దొంగ.

నేను లంచాలు తీసుకోవడం కాని, దొంగతనాలు చేయడంగాని చేయను. అది ప్రజలందరికి తెలుసు. అసెంబ్లీ స్టాఫ్‌ వెళ్లి హీరోహోండా షోరూమ్‌ ను తనిఖీ చేస్తే అక్కడ మోటర్‌ బైక్‌ లకంటే అసెంబ్లీ టేక్‌ ఫర్నీచర్‌ కనిపించింది. అసెంబ్లీ ఫర్నీచర్‌ హిరోహోండా షోరూమ్‌ లో ఉండటమేంటి?

కోడెల నిన్నటినుంచి మూడు క్యాంప్‌ కార్యాలయాలు ఉన్నాయని ప్రకటిస్తున్నారు. అంటే ఆయన దొంగిలించిన అసెంబ్లీ సొత్తు ఎక్కడ పెడితే అక్కడ క్యాంప్‌ కార్యాలయంగా బావించాలా? రెండో స్కామ్‌ ఇది ప్రసవ వేదన పడుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు కోడెల ఇంట్లో ఉన్న30 ల్యాప్‌ ట్యాప్‌ లు గెస్ట్‌ హౌస్‌ లో పెట్టి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ వారికి ఫోన్‌ చేశారు.

అంటే దొంగిలించిన సొత్తు తిరిగి ఇచ్చేసినంతమాత్రాన కేసులు మాఫీ కావు. ఈ శిక్షఅనుభవించాల్సిందే. క్రిమినల్‌ ప్రొసీజర్‌ ప్రకారం మీ పై చర్య తీసుకోబడుతుంది. కోడెల అంతటి వ్యక్తికి కనీసం సిగ్గన్నా ఉండాలి కదా. అసెంబ్లీలో భధ్రత లేదని ఫర్నీచర్‌ ఇతర సామాను ఆయన ఇంట్లో పెట్టుకున్నారని చెప్పడం ఏంటి?

ఓ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వందల కొద్ది అబధ్దాలు ఆడుతున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. తప్పు చేసిన మీరు శిక్ష అనుభవించాల్సిందే. సత్తెనపల్లిలో టిడిపి వారిని వేధిస్తున్నారని కోడెల ఆరోపిస్తున్నారు. నేను సవాల్‌ చేస్తున్నా ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్, నేను సత్తెనపల్లిలో గెలిచిన తర్వాత టిడిపి వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదు.

మేం ధర్మంగా వెళ్తాం. మేం ఏమాత్రం వేధింపులకు గురిచేయడం లేదు. సత్తెనపల్లిలో కోడెల ఆయన కుమారుడుపై కేసులు పెట్టింది టిడిపి వారే. గజదొంగల కుటుంబంగా మీ కుటుంబం తయారైంది. మీ అమ్మాయి, అబ్బాయి పారిపోయారు. ధైర్యంగా నేరాన్ని ఒప్పుకోండి. స్పీకర్‌ గా ఉండి అనేక అన్యాయాలు చేశాను అని ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు.

మీడియా ముందు కూర్చుని నీతి వాఖ్యాలు పలికితే నమ్మేస్దితిలో ప్రజలు లేరు. మీరు చేసిన పాపాలే మిమ్మల్ని వెంటాడుతున్నాయి. మిమ్మల్ని సపోర్ట్‌ చేసే టిడిపి నేతగాని, టిడిపి కార్యకర్తగాని లేరు. చంద్రబాబూ..కోడెల గురించి మాట్లాడండి. మీ పార్టీనుంచి సస్పెండ్‌ చేయండి.

కోడెల దొరికిన దొంగ. చంద్రబాబు దొరకని దొంగ. రెండున్నమాసాలలో జగన్‌ కి పాలించే అర్హత పోయిందంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. అందుకే ప్రజలు మీకు 23 స్దానాలు ఇచ్చారు" అని ఎద్దేవా చేశారు.