శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (08:41 IST)

చంద్రబాబుకు షాక్... బీజేపీలోకి దేవేందర్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇప్పటికే అనేకమంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతానికి ఓ నలుగురు లేదా ఐదుగురు సీనియర్ నేతలు పార్టీలో ఉంటే వారిలో ఇద్దరు గుడ్ బై చేప్పేందుకు రెడీ అయ్యారు. 
 
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా గత కొన్నిరోజులుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు దేవేందర్ గౌడ్. 
 
క్యాన్సర్ వ్యాధితో బాధపడిన ఆయన అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నారు. అనారోగ్యం కారణంగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంలో గానీ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గానీ పాల్గొనలేదు. 
 
ఇకపోతే ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తండ్రి దేవేందర్ గౌడ్ తో కలిసి వీరేందర్ గౌడ్ కూడా టీడీపీ లో చేరతారంటూ సమాచారం. వీరేందర్ గౌడ్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.
 
బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే దేవేందర్ గౌడ్ తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఇకపోతే దేవేందర్ గౌడ్ కు బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. 
 
తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉండేవారు దేవేందర్ గౌడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా మెలిగారు. అమెరికాలో చికిత్సపొందుతున్నప్పుడు చంద్రబాబు సైతం ఆయనను కలిశారు.  
 
అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేకపోవడం, క్యాడర్ సైతం బీజేపీలోకి వెళ్లాలంటూ ఒత్తిడి పెంచుతుండటంతో దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తో కలిసి బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తెలుగుదేశం పార్టీగానీ అటు బీజేపీ గానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.