సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (08:35 IST)

బందరు పోర్టు వ్యవహారంలో చంద్రబాబుకు నాని షాక్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ ఎంపీ కేశినేని నాని మద్దతు ప్రకటించారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. 
 
బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని సమర్ధిస్తూనే జగన్ కు సలహాలిచ్చారు. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణకో, వాన్‌పిక్‌కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వమే ఈ పోర్ట్ పనులను నిర్వహించేలా నిర్ణయం తీసుకోని  చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేశినేని నాని జగన్ ను కోరారు.
 
 ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంగానే గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది.  ఆ సంస్థకు లీజుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి నష్టం కల్గించినందుకు పరిహారం కోరే అవకాశాలను కూడ పరిశీలించాలని ప్రభుత్వం న్యాయ నిపుణులను కోరింది.
 
అసలేం జరిగింది?
బందరు పోర్ట్ నిర్మాణం కోసం నవయుగ సంస్థ ‘‘లీడ్ ప్రమోటర్‌’’గా మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్ట్ నిర్మాణం కోసం గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్‌‌కు లీజుకిచ్చిన 412.57 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
 
 పోర్ట్ నిర్మాణం కోసం గత 11 ఏళ్లుగా కన్సార్షియం శ్రద్ధ చూపించలేదని.. పలుమార్లు గడువు పెంచినా పట్టించుకోలేదని, దశాబ్ధకాలంగా పనులు ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని వసూలు చేసే హక్కు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఒప్పందం రద్దుకు కారణాలు ఇవే:
2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బందరులో పోర్ట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పోర్టు నిర్మాణ బాధ్యతలను మైటాస్ ఇన్‌ఫ్రా-ఎన్‌సీపీ-ఎస్ఆర్ఈసీ-ఎన్‌సీపీ కన్సార్షియంకు అప్పగించారు.
 
ఈ కన్సార్షియం వజ్రా సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక ఎస్పీవీని రిజిస్టర్ చేయించింది. ఈ ఎస్పీవీతో ప్రభుత్వం 2008 ఏప్రిల్ 21న ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 12 నెలల్లో బందర్ పోర్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేయాలి.
 
ఈ సమయంలోనే కన్సార్షియంలోని మైటాస్ ఆర్ధిక పరిస్ధితి దిగజారింది. అటు ఎస్ఆర్ఈఐ, ఎస్‌సీపీలు కూడా కన్సార్షియం నుంచి తప్పుకున్నాయి. దీంతో పోర్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు 2010 ఏప్రిల్ 15న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌ను లీడ్ ప్రమోటర్‌గా చేర్చుకోవడానికి అనుమతించాలని సదరు కన్సార్షియం ప్రభుత్వాన్ని కోరింది.
 
ఇందుకు నాటి ప్రభుత్వం అనుమతించింది. 2010 జూన్ 7న దీనిపై మరో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత పలుమార్లు ఫైనాన్షియల్ క్లోజర్‌కు గడువు పొడిగిస్తూ వెళ్లారు. కొత్త డీపీఆర్ ప్రకారం 2022 నాటికి పోర్ట్ పూర్తి చేయాలి. 2017 మార్చిలో నౌకాశ్రయ శాఖ 2985 ఎకరాలను సేకరించింది. సదరు భూమిని తీసుకోవడానికి కన్సార్షియం కొన్ని షరతులు పెట్టింది. 
 
పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన మొత్తం 5,324 ఎకరాలు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా తమకు అప్పగించాలని తెలిపింది. అలాగే కొన్ని మౌలిక సదుపాయాలతో పాటు, ప్రాజెక్ట్ స్థలం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారి ఏర్పాటు చేయాలని పేర్కొంది.
 
భారత ఒప్పంద చట్టం 1872 ప్రకారం అసలు ఫైనాన్సియల్ క్లోజర్‌ను ఎంపీపీఎల్ సాధించలేదని పేర్కొంది. దీంతో ఈ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం తమకుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
 
మొదటి, రెండో దశ ప్రాజెక్ట్ పనులకు కావాల్సింది 310 ఎకరాలు మాత్రమేనని... 2008 నాటికే 412.57 ఎకరాలను ఎంపీపీఎల్‌కు అప్పగించామని.. అయినప్పటికీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని ప్రభుత్వం తెలిపింది.
 
ఒకవేళ 2017లో ఇస్తామన్న 2,985 ఎకరాలను తీసుకున్నా.. ప్రాజెక్ట్ ఈపాటికే పూర్తయ్యేదని.. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి సదరు కన్సార్షియం ఆ భూములను తీసుకోలేదని చెప్పింది. 
 
వివాదాలు-నత్తనడకన పనులు
బందరు పోర్ట్ పనుల్లో భాగంగా 2012లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 5,320 ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేశారు. అయినప్పటికీ పనులు ప్రారంభంకాలేదు. 2015 ఆగస్టులో టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 వేల ఎకరాలలో పోర్టు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు.
 
దీనిపై స్థానిక రైతులు అభ్యంతరం తెలపడంతో .. రాజధాని అమరావతి కోసం అనుసరించిన ల్యాండ్‌ ఫూలింగ్ విధానంలో రైతులకు మేలు జరిగేలా మరోసారి 2016 ఆగస్టులో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు.
 
2017 మార్చి నెలలో 3,010 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని సమీకరించి కాకినాడ పోర్ట్ డైరెక్టర్‌కు అప్పగించారు. అలాగే పోర్ట్ అభివృద్ధి కోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)ను 2016లో ఏర్పాటు చేశారు. ముడా ఆధ్వర్యంలో భూసమీకరణ, సేకరణ ప్రక్రియను చేపట్టారు. 
 
పోర్టుకు అవసరమైన ప్రైవేట్ భూమిని ఎకరా 25 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తపసిపూడి వద్ద పోర్ట్ పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన చేశారు. లీడ్ ప్రమోటర్‌గా వున్న నవయుగ సంస్థ ప్రాజెక్ట్ స్థలం వద్దకు భారీగా యంత్రాలను తరలించి, పనులను కూడా ప్రారంభించింది.