మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (13:46 IST)

తేజస్విని హత్యకేసు.. ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు సీఎం జగన్‌ను కలిశారు. దివ్య తేజస్విని తల్లిదండ్రులను హోంమంత్రి సుచరిత సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. వారికి జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తేజస్విని హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 
 
కాగా.. రెండు రోజుల క్రితం విద్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన హోంమంత్రి సూచరితను.. సీఎం గారిని కలిసే ఏర్పాటు చేయాలని దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు. దివ్య తేజస్వి తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆమె ప్రత్యేకంగా చొరవ చూపించారు. 
 
అలాగే సాక్షుల విచారణ పూర్తి చేసిన పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. పండగ సెలవులు ముగిశాక కోర్టుకు ఛార్జిషీటు సమర్పించనున్నారు. మరోవైపు నిందితుడు నాగేంద్రను సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో డిశ్చార్జ్‌ అనంతరం నాగేంద్రను విచారించనున్నారు పోలీసులు. 
 
దివ్య స్వయంగా గాయాలు చేసుకోలేదని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దివ్యపై కత్తితో దాడి చేసి ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నాగేంద్ర కోసుకున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు.