ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:27 IST)

అధైర్యపడకండి..నేనున్నా: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో దువ్వూరు వద్ద ఇటీవల జరిగిన  రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరామర్శించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి మేకపాటి ఆయన ఓదార్చారు.

ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్ బీమా ద్వారా ఆర్థికంగా అండగా నిలబడతామన్నారు.  నివాసం సహా అర్హతలను పరిశీలించి ఉద్యోగవకాశం కల్పిస్తామని మంత్రి మేకపాటి వెల్లడించారు. సంగం మండలంలో ఆదివారం పర్యటించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  అండగా ఉంటానని, అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
 
గత మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన దువ్వూరు దళితవాడకు చెందిన ఆరు కుటుంబాలను  ఓదార్చేందుకు తరలివెళ్లిన మంత్రిని చూసి ఒక్కసారిగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కుటుంబ యజమానులు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలన్నారు.
 
 మృతులలో చిన్నవాడైన గంగపట్నం శ్రీనివాసులు కుటుంబసభ్యుల రోదనలు అందరిని కన్నీరుపెట్టించాయి. ఆ కుటుంబాన్ని అవసరమైతే ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
 
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్ కంటాబత్తిన రఘునాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎం దేవసహాయం, వైఎస్సార్సీపీ నేతలు సూరిమదన్, మోహన్ రెడ్డి, దగుమాటి మధుసూధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కె రవీంద్రరెడ్డి, కె కరుణాకర్‌రెడ్డి, కె బాలకృష్ణారెడ్డి, నారయ్య, ప్రసాద్ తదితులు పాల్గొన్నారు.
 
సత్రం సెంటర్ లో టీ తాగుతూ ఆప్యాయంగా పలకరించిన మంత్రి మేకపాటి
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం అనంతరం మంత్రి మేకపాటి ఆత్మకూరులో పర్యటించారు. స్థానిక సత్రం సెంటర్ అరుగు మీద కూర్చుని టీ తాగుతూ ఆప్యాయంగా పలకరించారు. ప్రజల మధ్య కూర్చుని వారితో ఉన్న అనుబంధాన్ని, ఆత్మకూరు సమస్యలపై మనసారా మాట్లాడారు.

అనంతరం పలు సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు తక్షణమే పరిష్కరించే విధంగా ఆదేశాలిచ్చారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ. వైస్ చైర్మన్ షేక్ సర్థార్ మంత్రి మేకపాటిని ఘనంగా సన్మానించారు.

తొలుత మున్సిపల్ బస్టాండ్ ఆవరణకు చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతన కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యకర్తలు, నాయకులందరిని పేరు పేరున మంత్రి గౌతమ్ రెడ్డి పలకరించారు. వాళ్లతో కలసి టీ తాగారు.

గతంలో ఎన్నికలు, పాదయాత్ర సమయంలో ఇక్కడే టీ తాగిన విషయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలే బలం బలగమంటూ వారితో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేయించారు.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఆత్మకూరులో ప్రధానమైన డ్రైనేజీ సమస్య, మారుమూల ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బైపాస్ రోడ్డు నుండి కాశీనాయన ఆశ్రమం వరకు రింగు రోడ్డును నిర్మించేందుకు డిజైన్లు రూపొందాయని మంత్రి పేర్కొన్నారు.

త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీకి ఘన విజయం అందించిన అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. కొత్త బస్టాండ్ భవన నిర్మాణానికి నిధుల కొరత లేదని ఆయన మీడియా ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.