శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:43 IST)

ఎవ‌రూ చెత్తప‌న్నును చెల్లించ‌వ‌ద్దు: ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య

మున్సిపల్ అధికారులు సెప్టెంబర్ నుండి చెత్త పన్నులు వసూలు చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారని ఎవరూ ఈ చెత్తపన్నును చెల్లించవద్దని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య, టాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సి.హెచ్ బాబూరావు మాట్లాడుతూ విజయవాడ తో సహా రాష్ట్రంలోని అనేక పట్టణాలలో చెత్త తొలగింపుకు చార్జీలు చెల్లించాలని ఆయన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారన్నారు దీనివలన పట్టణ ప్రజలపై రు600 కోట్ల భారం పడుతుందని అన్నారు.

రాష్ట్రంలో ప్రతిపనికీ యూజర్ చార్జీలు వసూలు చేయమని కేంద్రం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేస్తున్నదని, దానిలో ఈ చెత్త పన్ను కూడా భాగమని అన్నారు. చెత్తపన్ను అనేది చట్టంలో లేదని, ఇది చట్టవిరుద్ధమని అన్నారు. అటువంటి  చట్టవిరుద్ధమైన ఈ పన్నును పట్టణ ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి యం,వి. ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణాలలో పారిశు ధ్యానం అనేది మున్సిపల్ సంస్థలు చేయవలసిన విధియని దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చవలసిఉందని అన్నారు

పట్టణంలో చెత్త తొలగింపు అన్నది ప్రజారోగ్యంలో భాగమని. ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కనక ఇళ్ల వద్ద చెత్త సేకరణ మొదలు ఆ చెత్తను నశింపజేసేవరకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రజలకు కావలసిన సమిష్టి పనులను నిర్వహించటానికే రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని కనుక ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుండి ఖర్చుచేయాలే తప్ప మరల ప్రజల వద్ద వసూలు చేయటం సరైంది కాదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ నాయకులు ఎస్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిసేవకు చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు పన్నులు చెల్లించవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా పౌర సంక్షేమ సంఘం నాయకులు డి.కాశీనాధ్. ఐద్వా పశ్చిమ కృష్ణా కార్యదర్శి కె. శ్రీదేవి, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు యం.ఎన్ పాత్రుడు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ వి.శ్రీనివాస్, ఫోకస్ నాయకులు కే.రమేష్, నాగరాజు, టి.వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

అనంతరం పట్టణాలు, నగరాలు మున్సిపల్ అధికారులు చెత్త సేకరణ చార్జీలు చెల్లించాలని జారీ చేస్తున్న సోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉపసంహరించుకొనే వరకు ఆంధోళనా కార్య క్రమాలను నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించారు.