ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:35 IST)

హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి లబ్ధి: బీజేపీ, జనసేనలపై మండిపడ్డ మల్లాది విష్ణు

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్నం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.

ఇతర రాష్ట్రాల కంటే పని తీరులో ఏపీ పోలీసు వ్యవస్థ  ముందుందని అన్నారు. సంవత్సర కాలంపైగా రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పోలీసులు త్వరితగతిన ఛేదించారని చెప్పారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అంతర్వేది ఘటనను టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రాజకీయ పరమైన అవకాశంగా తీసుకుని ప్రజలను రెచ్చగొడుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయి.

ఢిల్లీలో, హైదరాబాద్లో, ఇళ్లలో కూర్చుని దీక్షలు చేయటం దేనికి సంకేతం..? అంతర్వేది ఘటనపై ప్రభుత్వం, మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించారు. 

ఛలో అంతర్వేది అనేది ఒక రాజకీయ కుట్ర. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్‌ నాయకత్వం కావాలని.. కులం, మతం, చూడకుండా సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకున్నారు.

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు 50 శాతం మెజార్టీ ఓట్లు వేసి ప్రజలు గెలిపించిన నాయకుడికి, ఆ ప్రభుత్వనికి మతాలను, కులాలు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నాయి.  ఘోర పరాజయం చెందిన పార్టీలు సైతం మా గురించి మాట్లాడుతున్నాయి.

రాష్ట్రంలో ఎక్కడే ఘటన జరిగినా తక్షణం స్పందించే నాయకుడు సీఎం జగన్‌. సీబీఐకి ఇచ్చిన నెల రోజుల సమయంలో నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాము. సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించడం మా చిత్తశుద్ధికి తార్కాణం.

ఎవరైనా తప్పు చేస్తే సీబీఐ ఎంక్వైరీ వేస్తారా ? టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కులాలను, మతాలను రెచ్చ గొడుతున్నాయి. 

వారు ఏనాడైనా అంతర్వేది వెళ్లి స్వామిని దర్శించుకున్నారా ? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అంతర్వేది వెళ్లి  స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

మా ప్రభుత్వంలో హిందు ధర్మ పరి రక్షణను ముందుకు తీసుకు వెళుతున్నాము. హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. గత ప్రభుత్వాన్ని మాతో పోలుస్తూ బీజేపీ నాయకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉండవు. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు ఏపీలో తావులేదనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాము. ప్రభుత్వంపై బురద జల్లే వారిని సీబీఐ ఎంక్వైరీ నోరు మెదపలేని స్థితికి నెట్టింది.

రాష్ట్రంలో అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్‌ కోరుకుంటున్నారు. ప్రతిపక్షాల కుట్రలకు కుతంత్రాలకు సీబీఐ ఎంక్వైరీ ఒక అడ్డుకట్ట లాంటిద’’ని అన్నారు.