గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (11:47 IST)

వాలంటీర్లే రేషన్ సరుకులు ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారు...

అమరావతి : రాష్ట్రంలో రేషన్‌ డీలర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రజాపంపిణీలో కీలకమైన ఈ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. 
 
డీలర్ల తొలగింపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 29,500మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు.
 
 వీరిలో చాలామంది దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వారికి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి పని చేయిస్తోంది. కార్డుదారులకు పంపిణీ చేసే సరుకులపై ఇచ్చే కమీషన్‌ ఆధారంగా వీరు జీవనం సాగిస్తున్నారు. తమకు గౌరవ వేతనం ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 
 
అయితే డీలర్ల స్థానంలో సరుకుల పంపిణీని ఇకపై వాలంటీర్లు చేస్తారని రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో ఈ వ్యవస్థ గందరగోళంలో పడింది. 
 
దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వకముందే డీలర్లను పూర్తిగా తొలగిస్తారనే ప్రచారం జోరందుకుంది. అందుకు బలం చేకూర్చేలా ఇప్పుడు వారిని తొలంగించేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు దృష్టిపెట్టారు. 
 
ఆ తర్వాత వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏంచేయాలి, న్యాయపరమైన చిక్కులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కూడా చర్చిస్తున్నారు.
 
ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీరు సిద్ధంగా ఉన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తమను తొలగించడం సాధ్యంకాదని వాదిస్తున్నారు. 
 
అయితే ఎవరిచ్చినా కార్డుదారులకు సరుకులు అందడమే అంతిమ లక్ష్యమని ఆహార భద్రత చట్టం చెబుతోందని కొందరు అధికారులు అంటున్నారు. 
 
కాగా, ఇప్పటికిప్పుడు రద్దు ప్రకటన చేస్తే జూలై, ఆగస్టుల్లో సరుకుల పంపిణీ కష్టమవుతుందనే అభిప్రాయంతోనే ప్రభుత్వం మౌనంగా ఉందని డీలర్లలో కొందరు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత తొలగిస్తారని ప్రచారం సాగుతోంది. 
 
ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో పౌరసరఫరాల శాఖ వెల్లడించిన నూతన పంపిణీ విధానంలోనూ ఎక్కడా డీలరు పేరు కనిపించలేదు. 
 
స్టాక్‌ పాయింట్‌ నుంచి వాలంటీర్లే సరుకులు తీసుకుని, ఇంటింటికీ తిరిగి డోర్‌ డెలివరీ చేస్తారని నూతన విధానం వివరిస్తోంది. కనీసం తమను స్టాక్‌ పాయింట్‌లో అయినా ఉంచుతారేమోనని డీలర్లు ఆశిస్తున్నారు.
 
 కానీ గ్రామ సచివాలయంలో ఒక పౌరసరఫరాల ఉద్యోగి ఉండాలని ఇటీవల ఆ శాఖ ప్రతిపాదించడంతో వీరికి ఆ అవకాశం కూడా లేదని తేలిపోయింది.