ఆమె వయసు(23)లో చిన్నది... ఇతడు వయసు(40)లో ముదురు... అనుమానంతో...
అతడి అనుమానం ఆమె ప్రాణం తీసింది. అతడి వక్ర బుద్ధి కారణంగా మొదటి భార్య అతడి నుంచి విడాకులు తీసుకుని ప్రాణాలను రక్షించుకుంది. కానీ రెండో భార్యగా వచ్చిన ఆ యువతి అతడి చేతిలో బలైంది. అనుమానం పెనుభూతంగా మారడంతో అతడు రాక్షసుడిలా మారి ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కొట్టాను కానీ చంపింది నేను కాదు అంటున్నాడు సదరు మృగాడు. ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
మాధవి... నిరుపేద కుటుంబానికి చెందిన ఈమెను బాగా బతుకుతుందని పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణనిచ్చే 40 ఏళ్ల శివాజీకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇతడి నుంచి మొదటి భార్య విడాకులు తీసుకుంది. కానీ తమ బిడ్డ బాగా బతుకుతుందని 23 ఏళ్ల మాధవిని వయసు తేడా 17 సంవత్సరాలున్నా అతడికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుని ఆమెను గుంటూరుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వారికి ఓ బాబు, పాప పుట్టారు.
ఐతే నగర జీవితంలో ఆమెకు నరకం ప్రారంభమైంది. ఆమె వయసులో చిన్నది. ఇతడు వయసులో ముదురు. నగరం అనేసరికి పరిస్థితులు ఎలా వుంటాయో తెలిసిందే కదా. కలుపుగోలుగా మాట్లాడేవారు ఎక్కువగా వుంటారు. అదే అతడి అనుమానానికి కారణమైంది. ఆమెతో పక్కింటివారు ఎవరైనా మాట్లాడినా, ఆమెను చూసి ఎవరైనా నవ్వినా ఇక వారితో లింకులు పెట్టడం మొదలుపెట్టేవాడు. ఇలా ఆమెను మానసికంగా క్షోభకు గురిచేసేవాడు. ఇతడి బారి నుంచి తప్పించుకుని వెళ్లిపోదామంటే తనకు ఇంకెవరూ దిక్కులేరు. అందుకే ఆ బాధలను దిగమింగుతూ కాలం గడుపుతూ వచ్చింది.
ఐతే సోమవారం నాడు అతడు పశువులా మారిపోయాడు. ఎవరెవరితోనూ లింకులు అంటగడుతూ ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు. దాంతో ఆమె వళ్లంతా వాతలు తేలిపోయింది. చివరికి ప్రాణాలు వదిలింది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న ఆమె తరపు కుటుంబ సభ్యులు వచ్చేసరికి తనపై దాడి జరగకుండా వుండేందుకు పోలీసులను రక్షణగా పెట్టేసుకున్నాడు. పైగా మాధవి శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తరలించాడు. ఐతే ఆమె బంధువులు గొడవకు దిగడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ... నిందితుడు మాత్రం తను తన భార్యను కొట్టిన మాట వాస్తవమే కానీ చంపలేదని అంటున్నాడు. మరి పోస్టుమార్టం రిపోర్టులో నిజం తెలియాల్సి వుంది.