గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (17:22 IST)

డాక్టర్ సుధాకర్‌పై దాడి .. పోలీసులపై సీబీఐ విచారణ : హైకోర్టు ఆదేశం

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు మాస్కులు కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు చేసిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్టణం పోలీసులు ప్రవర్తించిన తీరును ఏపీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. డాక్టర్ సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ పోలీసులపై తక్షణం కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టి 8 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలుజారీచేసింది. 
 
మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని వ్యాఖ్యలు చేసినందుకు డాక్టర్ సుధాకర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన సొంతూరు విశాఖపట్టణంకు వెళ్లారు. అక్కడ ఆయన పట్ల వైజాగ్ పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. జాతీయ రహదారిపై తాగి రచ్చ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన బట్టలు విప్పించి, చేతులు వెనక్కి కట్టి, దుర్భాషలాడుతూ, కొట్టారు. 
 
అంతేకాదు ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో... ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు. 
 
మరోవైపు, డాక్టర్ సుధాకర్ ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. డాక్టరుపై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 
 
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం 
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
 
ఎన్-95 మాస్కు అడిగినందుకు ఓ డాక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ, నిర్బంధించడమేకాకుండా, పోలీసులతో హింసకు పాల్పడ్డారని, దీని వెనకున్న ప్రభుత్వ కుట్ర సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్టు అందులో పేర్కొన్నారు.