శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 మే 2020 (17:39 IST)

కృష్ణలంక రెడ్ జోన్ లలో డ్రోన్ నిఘా

కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలపై కృష్ణలంక పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెడ్ జోన్లుగా గుర్తించబడిన ప్రాంతాలలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 
 
కంటైన్మెంట్ జోన్లలో డ్రోన్ సహాయంతో నిఘా పెట్టడమే కాకుండా, కరోనా వైరస్ బారినపడకుండా డ్రోన్ ల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. డ్రోన్ లకు అమర్చిన కెమెరాలతో డేగకంటితో గస్తీ కాస్తూనే, అదే డ్రోన్ లకు స్పీకర్లను అమర్చి రెడ్ జోన్ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో డ్రోన్ పనితీరును డీసీపీ విక్రాంత్ పాటిల్, ఏసీపీ ఎన్.సూర్యచంద్రరావు పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రెడ్ జోన్లలో ప్రజలెవ్వరూ ఇళ్ల నుండి బయటికి రాకూడదని అన్నారు.

అంతర్గత రహదారుల్లో ప్రజల సంచారాన్ని నియంత్రించేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోస్తున్నామని, కోవిడ్-19 వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రోన్ ల సహాయంతో ప్రజలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కృష్ణలంక సీఐ పి.సత్యానందం మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న  ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.

లాక్ డౌన్ నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటించాలని, రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నిత్యావసరాల కోసం ఎవ్వరూ వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదని, నగరపాలకసంస్థ ఏర్పాటుచేసిన ఎం-మార్ట్ నంబర్లకు ఫోన్ చేసినట్లయితే ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందజేయబడతాయని అన్నారు.

ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామని, సహేతుక కారణాలు లేకుండా బయటికి వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని సీఐ సత్యానందం పేర్కొన్నారు.